Begin typing your search above and press return to search.

న‌వ్వులపాల‌యిన త‌ర్వాత కానీ మోడీ స్పందించ‌లేదు

By:  Tupaki Desk   |   23 Aug 2018 5:01 PM GMT
న‌వ్వులపాల‌యిన త‌ర్వాత కానీ మోడీ స్పందించ‌లేదు
X
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల తర్వాత శుక్రవారం మరోసారి తన శాఖ బాధ్యతలను చేపట్టారు. ప్రధాని సూచన మేరకు భారత రాష్ట్రపతి.. అరుణ్ జైట్లీకి ఆర్థిక - కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు అని అధికారిక నోటిఫికేషన్ ఇవాళ ఉదయం విడుదల చేశారు. చూస్తుంటే...ఇది సాదాసీదా ప‌రిణామంగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ...దీని వెనుక ఆస‌క్తిక‌ర రాజకీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా ప్ర‌తిప‌క్షం సెటైర్లు వేసే వ‌ర‌కు ప‌రిస్థితి చేరిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.

గ‌త కొద్దికాలంగా కేంద్ర ఆర్థిక శాఖ విష‌యంలో జ‌నాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్థిక‌మంత్రిగా సీనియ‌ర్ బీజేపీ నేత అరుణ్‌ జైట్లీనే పేర్కొంటున్న కేంద్రం ఆ శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ మ‌రో నాయకుడు పీయూష్ గోయ‌ల్‌ తో కానిచ్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీల‌క‌మైన జీఎస్టీ వ్య‌వ‌హారాలు మొద‌లుకొని ఇత‌ర అంశాలు కూడా గోయ‌ల్‌తో న‌డిపించేస్తున్న నేప‌థ్యంలో అస‌లు మంత్రి ఎవ‌ర‌నే అనుమానం స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది. వివిధ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ ఆర్థిక‌మంత్రి పీ చిదంబరం అనూహ్య‌మైన ట్విస్ట్ జోడించి కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు ఆర్థిక మంత్రులు ఉన్నారన్నారు. తెర వెనుక మంత్రి (మోడీ) - అధికారిక మంత్రి (పీయూష్ గోయల్) - అనధికారిక మంత్రి (అరుణ్ జైట్లీ) అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అత్యుత్త‌మ ఫ‌లితాలు ఆశించ‌గ‌ల‌డం ఎలా సాధ్య‌మ‌ని ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే, ఇలా ప‌రువుపోతున్న ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న స‌మ‌యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అంతకుముందు నుంచే జైట్లీ ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జైట్లీ లేని ఈ మూడు నెలలు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా చూశారు. అయితే మధ్యమధ్యలో అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్సుల్లో అధికారులతో మాట్లాడటం వివాదాస్పదమైంది. దీంతో ఆయ‌న‌కు పాత బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటు వేసేందుకు అరుణ్ జైట్లీ పార్లమెంటుకు వచ్చారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే అరుణ్ జైట్లీకి బేరియాట్రిక్ సర్జరీ కూడా జరిగింది. మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ పూర్తిగా బరువు తగ్గిపోవడంతో మరోసారి బరువు పెరగడానికి అప్పట్లో ఆ సర్జరీ చేశారు. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ చేసుకున్న తర్వాత మరోసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా నార్త్‌ బ్లాక్ తొలి అంతస్తులోని కార్యాలయాన్ని పూర్తిగా రెనొవేట్ చేశారు.