Begin typing your search above and press return to search.

133 డిమాండ్ల‌కు 66కు ఓకే అన్న జైట్లీ

By:  Tupaki Desk   |   12 Jun 2017 4:36 AM GMT
133 డిమాండ్ల‌కు 66కు ఓకే అన్న జైట్లీ
X
ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న జీఎస్టీ.. త్వ‌ర‌లో అమ‌ల్లోకి రానున్న సంగ‌తి తెలిసిందే. విడ‌త‌ల వారీగా వాయింపు లెక్క‌ను బ‌య‌టకు చెప్పారు జైట్లీ అండ్ కో. వివిధ వ‌స్తు సేవ‌ల మీద విధించిన ప‌న్నుల‌పై వివిధ వ‌ర్గాల నుంచి త‌గ్గించ‌మంటూ విన‌తులు రావ‌టం తెలిసిందే. కొన్ని వ‌స్తు సేవ‌ల మీద భారీగా విధించిన ప‌న్నుల్ని త‌గ్గించాల‌న్న విన‌తుల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కాస్తంత క‌నిక‌రించారు. మొత్తం 133 ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల్ని ప‌రిశీలించిన విత్త‌మంత్రి చివ‌ర‌కు 66 వ‌స్తువుల‌పై ప‌న్ను రేటు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

త‌గ్గించిన ప‌న్నుల కార‌ణంగా ఎవ‌రికి ఊర‌ట ల‌భించ‌నుంద‌న్న విష‌యాన్ని చూస్తే.. ప్ర‌తి ఇంటికి ఎంతోకొంత మేలు చేసేలా తాజా నిర్ణ‌యం ఉంద‌ని చెప్పాలి. మ‌రి.. ముఖ్యంగా వంటింటి మీద భారం త‌గ్గేలా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింద‌ని చెప్పొచ్చు.

తాజా త‌గ్గింపుతో దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వర్గాల‌కు ఊర‌ట క‌లిగించేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆహార ఉత్ప‌త్తుల‌పైన‌.. కొన్ని కీల‌క వ‌స్తువుల మీద ప‌న్ను ధ‌ర‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సినిమా టికెట్ల మీద భారీగా ప‌న్ను విధించి.. విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భుత్వం.. కాస్తంత క‌నిక‌రించింది. అయితే.. ఇది పూర్తి స్థాయి సంతృప్తిగా మ‌ర‌ల్చ‌టంలో మాత్రం విఫ‌ల‌మైంద‌ని చెప్పాలి. వంద రూపాయిలు.. అంత కంటే త‌క్కువ టికెట్ల ధ‌ర‌పై ప‌న్నును త‌గ్గించారు కానీ.. వంద‌కు పైన ఛార్జ్ చేసే వ‌స్తువుల‌పై మాత్రం మొద‌ట ఫిక్స్ చేసిన బాదుడే ఉండ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా త‌గ్గించిన వ‌స్తుసేవ‌ల ప‌న్ను రేట్ల‌ను చూస్తే..మొత్తం నాలుగు విభాగాల్లోనూ త‌గ్గింపులను చేర్చారు. తొలి ద‌శ‌లో 18 శాతం ప‌న్నుగా ఫిక్స్ చేసి.. తాజాగా ఆ ప‌న్నును 5 శాతానికి త‌గ్గించిన వ‌స్తుసేవ‌ల్ని చూస్తే.. వ‌జ్రాలు.. తోలు.. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌.. ఆభ‌ర‌ణాలు.. ప్రింటింగ్ ప‌రిశ్ర‌మ ఉన్నాయి. ఇప్ప‌టికే 12 శాతంగా ఫిక్స్ చేసి.. తాజాగా 5 శాతం ప‌న్ను రేటుగా ఫిక్స్ చేసిన వ‌స్తుసేల్ని చూస్తే.. జీడిప‌ప్పు.. అగ‌ర‌బ‌త్తీలు.. ఇన్సులిన్ ఉన్నాయి. 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గిన వ‌స్తు సేవ‌ల్ని చూస్తే.. ఫ్యాకేజ్డ్ ఆహారం.. ప‌చ్చ‌ళ్లు.. సాస్ లు.. ఆవాలు.. ముర‌బ్బా.. పిల్ల‌ల వ‌ర్క్ బుక్స్‌.. స్పూన్లు. పోర్క్ లు.. వంటింటి చాకులు త‌దిత‌రాల‌పై త‌గ్గించారు.

భారీ ప‌న్ను రేటు అయిన 28 శాతంగా నిర్ణ‌యించి.. తాజాగా ఆ ప‌న్నును 18 శాతంగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ జాబితాలో స్కూల్ బ్యాగులు.. కాటుక‌.. ట్రాక్ట‌ర్ విడిభాగాలు. . ప్లాస్టిక్ పూస‌లు కంప్యూట‌ర్ ప్రింట‌ర్లు త‌దిత‌రాల‌పై ప‌న్ను రేటును త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

రోజువారీ వినియోగంపై ప‌న్నురేటును త‌గ్గించాల‌న్న స‌భ్యుల సూచ‌న మేర‌కు కొంత ప‌న్నురేటును త‌గ్గించిన‌ట్లుగా వెల్ల‌డించారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి హోట‌ళ్లకు కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌నుంది. ఏడాదికి రూ.75 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న వ్యాపారులు.. త‌యారీదారులు.. రెస్టారెంట్ల య‌జ‌మానుల‌కు కాస్తంత ఊర‌ట ల‌భించ‌నుంది. గ‌తంలో ఈ ట‌ర్నోవ‌ర్ 50 ల‌క్ష‌లుగా ఉండేది. వీరి ట‌ర్నోవ‌ర్ వారీగా 1..2..5 శాతం రేట్ల‌తో ప‌న్ను చెల్లించాల‌ని జైట్లీ ప్ర‌క‌టించారు.

ఇక‌.. చిత్ర‌ప‌రిశ్ర‌మ తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై జైట్లీ క‌ర్ర విర‌గ‌కుండా.. పాము చావ‌ని రీతిలో నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.100 కంటే ఎక్క‌వ‌గా ఉన్న టికెట్ల‌పై గ‌తంలో మాదిరే 28 శాతం ప‌న్ను బాదేస్తారు. ఇక‌.. టికెట్ రూ.100 కంటే త‌క్కువ‌గా ఉన్న ధియేట‌ర్ల‌పై 18 శాతం ప‌న్నును వ‌సూలు చేయ‌నున్నారు. గ‌తంతో పోలిస్తే ప‌న్ను భారం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపించినా.. అవేమీ అంత ఎక్కువ‌గా లేవ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జైట్లీ లాంటి పీనాసి ఆర్థిక‌మంత్రిగా ఉన్న వేళ‌.. ఓ మోస్త‌రుగా త‌గ్గిన పన్ను చాలా ఎక్కువ‌న్న‌ట్లుగా కొంద‌రు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/