Begin typing your search above and press return to search.

‘ప్రత్యేకం’ కాదు.. ‘ప్రత్యేక’ సాయం చేస్తారంట

By:  Tupaki Desk   |   6 Aug 2015 4:52 AM GMT
‘ప్రత్యేకం’ కాదు.. ‘ప్రత్యేక’ సాయం చేస్తారంట
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. కర్ర విరక్కుండా.. పాము చావని రీతిలో సమాధానం ఇచ్చిన జైట్లీ.. తన మాటల మాయాజాలాన్ని ప్రదర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి ప్రస్తావించకుండా.. ఎప్పుడో ఇచ్చే నిదులు.. వరాల గురించి చెప్పే ప్రయత్నం చేసిన జైట్లీ.. ఏపీకి రంగుల సినిమాను చూపించారు. విభజన కారణంగా ఏపీ చాలానష్టపోయిందని.. హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయి భారీగా నష్టపోయిందని.. అలాంటి ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పకొచ్చారు.

ఏపీకి అదనపు నిధులు ఇవ్వాలని.. ప్రత్యేకంగా చూడాలని ఆర్థిక సంఘం కూడా ప్రస్తావించిందని..గత ఏడాదిలో అలానే సాయం అందించామన్నారు. ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పిన ఆర్థిక సంఘం.. ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పిందంటూ తమ మనసులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ఏపీని చూడాలని ఆర్థిక సంఘం చెప్పిందన్న జైట్లీ.. రాజధాని నిర్మాణం.. హైకోర్టు.. సచివాలయం.. రాజ్ భవన్ లు లాంటివి ఏర్పాటు.. లాంటివి ఎన్నో చేసుకోవాల్సి ఉందని.. వాటికి అవసరమైన నిధులు కేంద్రం ఇస్తుందని చెప్పారు.

ఏపీకి అవసరమైన నిధులను అనేక మార్గాలతో కేంద్రం సమకూరుస్తుందని హామీలు ఇచ్చిన జైట్లీ.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చి చెప్పటం గమనార్హం. అంటే.. కేంద్రం ఇచ్చే ముష్టిని అందుకోవటానికి ఏపీ సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని మరోసారి జైట్లీ చెప్పకనే చెప్పేశారు.