Begin typing your search above and press return to search.

ఎంత పని చేశావు జైట్లీ జీ!!

By:  Tupaki Desk   |   12 April 2015 9:44 AM GMT
ఎంత పని చేశావు జైట్లీ జీ!!
X
అరుణ్‌జైట్లీ. కేంద్ర ఆర్థికమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక అనుంగుల్లో జైట్లీ ఒకరు. ఆర్థిక శాఖ వంటి ప్రాధాన్య శాఖ ఇవ్వడమే కాక పార్టీ పదవుల్లోనూ ఆయనకు పెద్ద పీట వేస్తారు. అనంతపురంలో జాతీయ ఎక్సైజ్‌ అకాడమీ శంఖుస్థాపనకు వచ్చిన సందర్భంగా జైట్లీ వ్యవహరించిన తీరు ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశం అవుతోంది.

ఏపీకి ఉన్న అతిపెద్ద సమస్య అయిన ప్రత్యేకహోదాను ఖరారుచేసేది, ఇతరత్రా ఆర్థిక అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్థికమంత్రే కాబట్టి జైట్లీతో శంఖుస్థాపన చేయించడం ద్వారా మేలు జరుగుతందని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు జైట్లీని రప్పించారు. ఈ శంఖుస్థాపన అయిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇంగ్లీష్‌లో కోరారు. ప్రజల వాణిని కూడా వినిపించేలా వారితో చప్పట్లు కూడా కొట్టించి మరీ మద్దతు సాధించారు బాబు. అనంతరం ఎంపీలు నిమ్మల కిష్టప్ప హిందీలో, జేసీ దివాకర్‌రెడ్డి ఇంగ్లీష్‌లో ఏపీలోని పరిస్థితులు వివరించారు. ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కిచెప్పారు.

వారి అనంతరం ప్రసంగించిన జైట్లీ తన ఏడు నిమిషాల ప్రసంగంలో....విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ డిమాండ్‌ చేసిందని చెప్పారు. ఏపీలోని కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. అంతే తప్ప ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. కరువు ప్రాంతానికి కేంద్రం నిధులు అందజేస్తుందని మాత్రమే చెప్పారు. నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన హామీలు ఏమీ ఇవ్వకుండా తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్ర ఆర్థికమంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే గంపెడాశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు జైట్లీ మొండి చేయి చూపారు. జైట్లీ విధానమే కేంద్ర ప్రభుత్వ వైఖరా అనే సందేహం పలువురిలో వ్యక్తం అవుతోంది.