Begin typing your search above and press return to search.

హైక్లాస్‌ ను వ‌దిలేసి..మిడిల్ క్లాస్‌ పై దెబ్బేశారే!

By:  Tupaki Desk   |   1 Feb 2018 5:30 PM GMT
హైక్లాస్‌ ను వ‌దిలేసి..మిడిల్ క్లాస్‌ పై దెబ్బేశారే!
X
దేశంలో ఏ పార్టీ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఒకే మూస ధోర‌ణిలో ప్ర‌యాణి్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. ఎందుకంటే.. గ‌తంలో కేంద్రంలో అధికారంలో ఉన్న దాదాపుగా అన్ని ప్ర‌భుత్వాలు కూడా సంప‌న్న వ‌ర్గానికి కొమ్ము కాసే ప్ర‌భుత్వాలుగానే అప్ర‌తిష్ఠ మూట‌గ‌ట్టుకున్నాయి. అయితే ఆ ప్ర‌భుత్వాల‌న్నింటికీ భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పుతామ‌ని గ‌డ‌చిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన న‌రేంద్ర మోదీ బాకాలు ఊదారు. స్విస్ బ్యాంకుల్లో న‌ల్ల కుబేరులు దాచుకున్న సంప‌ద‌నంతా దేశానికి తిరిగి తెప్పిస్తామ‌ని, ఆ ధ‌నాన్ని పేద ప్ర‌జ‌ల సంక్షేమానికి వినియోగిస్తామ‌ని కూడా ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. ఈ మాట‌ల‌ను న‌మ్మేసిన మ‌ధ్య త‌ర‌గ‌తి భార‌తం... మోదీకి జైకొట్టింది. ఫ‌లితంగా 3 ద‌శాబ్దాల త‌ర్వాత సంపూర్ణ మెజారిటీతో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఈ నేప‌థ్యంలో దేశంలోని న‌ల్ల కుబేరుల‌కు ఇక బ్యాండేన‌ని - వారి ఆట‌లు ఇక సాగ‌వ‌ని కూడా దేశ‌వ్యాప్తంగా పెద్ద ప్ర‌చారమే సాగింది. తొలినాళ్ల‌లో మోదీ స‌ర్కారు కూడా ఇదే త‌ర‌హా వైఖ‌రిలో ముందుకు సాగుతున్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చేసింది. స్విస్ బ్యాంకుల్లోని న‌ల్ల కుబేరుల జాబితాను వెల్ల‌డి చేయాల‌ని స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వానికి లేఖ‌ల మీద లేఖ‌లు రాసిన మోదీ స‌ర్కారు... ఆ త‌ర్వాత మాత్రం ఆ దిశ‌గా అంత‌గా దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి.

మొత్తంగా మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీగా కొన‌సాగుతుంద‌ని భావించిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు... స్విస్ స‌ర్కారు నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చినా కూడా ప‌ట్టించుకోకుండా... ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల మాదిరే తాము కూడా సంపన్న వ‌ర్గాలకు అనుకూలంగానే ముందుకు సాగుతామ‌ని చెప్ప‌క‌నే చెప్పేసింద‌న్న వాద‌న వినిపించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కొట్టిపారేసిన న‌రేంద్ర మోదీ... న‌ల్ల‌ధ‌నం భ‌ర‌తం ప‌ట్టేందుకే పెద్ద నోట్ల ర‌ద్దుపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, పేద‌ల‌కు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలిసినా... వారి దీర్ఘ‌కాలిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది. పెద్ద నోట్ల ర‌ద్దు వెంట‌నే మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ ప‌న్ను విధానం కూడా సంప‌న్న వ‌ర్గాల‌కు బ‌దులుగా పేద‌ - మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కే పెనుభారంగా మారింద‌న్న మాట వినిపించింది. దీనిపైనా ఎదురు దాడి చేసిన మోదీ స‌ర్కారు... చూడ్డానికి అంద‌రికీ అలా అనిపిస్తున్నా.... గ‌తంలో ప్ర‌తి వ‌స్తువుపై ప‌లు ర‌కాల ప‌న్నులు వేసి పేద‌ల‌ను నిలువునా దోచుకునే విధానానికి జీఎస్టీతో చెక్ పెట్టేశామ‌ని - జీఎస్టీ ఫ‌లాలు త్వ‌ర‌లోనే పేద‌ల‌కు అందుతాయ‌ని కూడా కాస్తంత గ‌ట్టిగానే వాదించింద‌ని చెప్పాలి.

ఈ మాట‌ల‌న్నీ ఎలా ఉన్నా... నేటి ఉద‌యం మోదీ స‌ర్కారు త‌న ఐదేళ్ల టెర్మ్‌ కు సంబంధించి ప్ర‌వేశ‌పెట్టిన చిట్ట‌చివ‌రి బ‌డ్జెట్ మోదీ స‌ర్కారు మాట‌లో ప‌స లేద‌ని తేల్చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. గ్రామీణ భార‌త వికాసం - రైతుల సంక్షేమ‌మే ప్ర‌ధానంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ బ‌డ్జెట్ పేద‌ల‌ను పెద్ద‌గా ఇబ్బంది పెట్టేది కాద‌న్న వాద‌న వినిపిస్తున్నా... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించిన ప‌లు అంశాలు దేశంలో మెజారిటీ వ‌ర్గంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మాత్రం చేదు వార్త‌ల‌నే వినిపించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ప‌న్ను ప‌రిమితిని మ‌రింత‌గా పెంచేసి మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను - ప్ర‌త్యేకించి ఉద్యోగ వ‌ర్గాన్ని, స్వ‌ల్ప ఆదాయ వ‌ర్గానికి ఊర‌ట క‌లిగిస్తార‌నుకుంటే... ఆ ధిశ‌గా జైట్లీ నోట సింగిల్ ప్ర‌క‌ట‌న కూడా వినిపించ‌లేదు. దేశంలో నిజాయ‌తీగా ప‌న్ను కట్టే వారు ఎవ‌ర‌న్నా ఉన్నారంటే... మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లేన‌ని ఠ‌క్కున స‌మాధానం వ‌స్తుంది. మ‌రి అలాంటి నిజాయ‌తీ క‌లిగిన మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు... నిజాయ‌తీ పాల‌న అంటూ బాకాలు ఊదిన మోదీ స‌ర్కారు చేసిన న్యాయ‌మేమిట‌న్న ప్ర‌శ్న ఇప్పుడు వినిపిస్తోంది.

జైట్లీ బ‌డ్జెట్ కార‌ణంగా దేశంలోని మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అనాథ‌లుగా మారిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌న్నులు నిజాయ‌తీగా క‌ట్టే మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆ విష‌యంలో ఎలాంటి మిన‌హాయింపులు ప్ర‌క‌టించిన మోదీ స‌ర్కారు... ప‌న్ను ఎగ్గొట్టే వాళ్ల‌పై ఎలాంటి దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి. వెర‌సి ప‌న్నులు క‌ట్టే వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌ని వారిని ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం... ప‌న్ను ఎగ్గొట్టే వాళ్ల‌ను కూడా ప‌ట్టించుకోన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే ప‌న్ను ఎగ్గొట్టి, బ్యాంకులు ఇచ్చిన రుణాల‌ను ఎగ‌వేసి విదేశాల‌కు ఎంచ‌క్కా ఎగిరిపోయిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా లాంటి వారిపై ఇక తాము ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోమ‌నే త‌మ అంత‌రంగాన్ని మోదీ స‌ర్కారు బ‌హిరంగ‌ప‌రిచింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జైట్లీ బడ్జెట్ ప్ర‌సంగాన్ని చూస్తే... నిజాయితీగా ప‌న్నులు క‌ట్టే మ‌ధ్య త‌ర‌గ‌తి వేత‌న జీవులు ఎవ‌రికీ ప‌ట్ట‌ని వాళ్లుగా మారారని... అవినీతిప‌రులు - ఎగ‌వేత‌దారులు - విజ‌య్ మాల్యాల‌కే ఈ దేశంలో విలువ అనుకునే మాదిరిగా ప‌రిస్థితి త‌యారైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.