Begin typing your search above and press return to search.

మోదీజీ... ఏ ఒక్క‌రూ హ్యాపీగా లేర‌ట‌!

By:  Tupaki Desk   |   1 Feb 2017 12:09 PM GMT
మోదీజీ... ఏ ఒక్క‌రూ హ్యాపీగా లేర‌ట‌!
X
2017-18 వార్షిక బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ఏ ఒక్క వ‌ర్గాన్ని కూడా సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. స్వ‌ల్పాదాయ వ‌ర్గాల వారికి ఏదో ఒక‌టి అరా వ‌రాలు ప్ర‌క‌టించేసిన జైట్లీ... మిగిలిన ఏ ఒక్క వ‌ర్గాన్ని కూడా సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయారు. వాణిజ్య వ‌ర్గాలు కూడా జైట్లీ ప‌ద్దుపై పెద‌వి విరిచేశారు. ఈ బ‌డ్జెట్‌ లో కొత్త‌గా రైల్వే బ‌డ్జెట్‌ ను అంత‌ర్భాగం చేసినా... జ‌నం మాత్రం బ‌డ్జెట్‌ పై పెద‌వే విరిచారు. గ‌తేడాది దాకా జ‌న‌ర‌ల్ బ‌డ్జెట్‌ కు ముందే రైల్వే బ‌డ్జెట్ పార్ల‌మెంటు వ‌చ్చేది. దీంతో రైల్వే బ‌డ్జెట్ రోజే కాకుండా... జ‌న‌ర‌ల్ బ‌డ్జెట్ రోజు కూడా జ‌న‌మంతా టీవీల ముందే కూర్చునేవారు. ఈ ద‌ఫా కూడా బ‌డ్జెట్‌ పై స‌గ‌టు జీవి భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. అంతేకాకుండా పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశంలోని న‌ల్ల‌ధ‌నమంతా దాదాపుగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరిపోయింది. అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ గొళ్లేల బిగింపు కార్య‌క్ర‌మం కూడా దాదాపుగా ముగిసింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఖ‌జానాకు వ‌చ్చిన సొమ్మునంత‌టినీ మోదీ స‌ర్కారు జ‌నానికి పంచుతుంద‌ని, లేదంటే ఈ బ‌డ్జెట్ లో జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌కు శ్రీకారం చుడుతుంద‌ని కూడా అంతా ఆశించారు. దీనిపై అన్ని మీడియా సంస్థ‌లు కూడా లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు రాసేశాయి. ఈ క‌థ‌నాల‌లో ప్ర‌తి కుటుంబానికి క‌నీస ఆదాయ ప‌థ‌కం ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారు అర‌వింద్ సుబ్రహ్మణియ‌న్ నిన్న అరుణ్ జైట్లీకి అంద‌జేసిన ఆర్థిక నివేదిక‌లోనూ ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. క‌నీస ఆదాయ ప‌థ‌కంపై ఆర్థిక నివేదిక‌లో సుబ్ర‌హ్మణియ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సుబ్రహ్మ‌ణియ‌న్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌తోనైనా మోదీ స‌ర్కారు... ప్రజామోదం క‌లిగిన ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని అంతా ఆశించారు. అయితే జ‌నం ముఖాన నెత్తుటి చెక్క లేని చందంగా చేసేశారు మోదీగారి మంత్రివ‌ర్యుడు జైట్లీ.

స్వ‌ల్పాదాయ వ‌ర్గాల వారికి మిన‌హా మిగిలిన ఏ ఒక్క వ‌ర్గానికి కూడా సంతోషం కలిగించే ఒక్క అంశం కూడా జైట్లీ ప‌ద్దులో లేద‌న్న‌ది జ‌నం మాట‌గా వినిపిస్తోంది. నిత్యం అభివృద్ధిపై పుంఖానుపుంఖాలుగా ప్ర‌సంగాలు చేసే ప్ర‌ధాని మోదీ... ఖ‌జానా నిండా డ‌బ్బులున్నా... ఒక్క వ‌ర్గాన్ని కూడా సంతోష‌పెట్ట‌లేక‌పోయారన్న వాద‌న లేక‌పోలేదు. అస‌లు మోదీ అంచ‌నాల‌కు కార్య‌రూపం ఇవ్వ‌డంలో జైట్లీ స‌ఫ‌లీకృతులు కాలేక‌పోయార‌న్న‌ది జ‌నం మాట‌. పెద్ద నోట్ల ర‌ద్దుతో పెద్ద క‌స‌ర‌త్తే చేసిన మోదీ స‌ర్కారు... ఈ బ‌డ్జెట్‌ లో జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తార‌ని అంతా భావించారు. అయితే జైట్లీ ప‌ద్దు మాత్రం ఆ దిశ‌గా అడుగులు వేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పాలి. దేశానికి రైతే వెన్నెముక‌గా బీజేపీ స‌ర్కారు చెబుతున్న రైతన్న‌కు బ‌డ్జెట్‌ లో ఎలాంటి ప్ర‌త్యేక ప‌థ‌కాలు లేక‌పోవ‌డం నిజంగా దారుణ‌మ‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/