Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నిక‌ల్లో తెలుగ‌మ్మాయికి ఓట‌మి

By:  Tupaki Desk   |   28 Jun 2018 4:44 AM GMT
అమెరికా ఎన్నిక‌ల్లో తెలుగ‌మ్మాయికి ఓట‌మి
X
అనూహ్య ఫ‌లితం వ‌చ్చింది. గెలుపు ప‌క్కా అన్న అంచ‌నాలు వెలువ‌డిన తెలుగ‌మ్మాయి అమెరికాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. యూఎస్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన మేరీల్యాండ్ ఆరో కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో తెలుగ‌మ్మాయి కాట్ర‌గ‌డ్డ అరుణా మిల్ల‌ర్ అనూహ్యంగా ఓడిపోయారు.

అమెరికా కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం జ‌రిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమ‌రీలో ఆమె.. మ‌రో డెమొక్రాట్ ప్ర‌త్య‌ర్థి క‌మ్ అప‌ర కుబేరుడైన డేవిడ్ ట్రోన్ మీద 5544 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ట్రోన్ 22,855 ఓట్లు సాధించ‌గా.. మిల్ల‌ర్ 17311 ఓట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. బ‌రిలో ఎనిమిది మంది అభ్య‌ర్థులు ఉండ‌టం కూడా అరుణ మిల్ల‌ర్ ఓట‌మికి కార‌ణంగా భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్ర‌ధాన అభ్య‌ర్థుల‌కు పోటీగా బ‌రిలో దిగిన వారిలో ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌కు ఒక్కొక్క‌రికి 5500 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రాగా.. మ‌రో ముగ్గురికి వెయ్యి లోపు ఓట్లు వ‌చ్చాయి.

బ‌రిలో ఎక్కువ మంది అభ్య‌ర్థులు ఉండ‌టం.. డ‌బ్బులు భారీగా ఖ‌ర్చు కావ‌టంతో తుది ఫ‌లితంపై ప్ర‌భావం చూపిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో ఓడిపోయిన నేప‌థ్యంలో.. ఈసారి ఎలా అయినా గెల‌వాల‌న్న ల‌క్ష్యంతో ట్రోన్ ఈ ఎన్నిక కోసం ఏకంగా రూ.65 కోట్లు ఖ‌ర్చు చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న ఓట‌మిపై అరుణ స్పందించారు. త‌మ ప్ర‌చారంలో ప‌ర్సుల్లేవ‌ని.. హృద‌యాలు.. అభిమానం ఉన్న‌ట్లు పేర్కొన్న ఆమె త‌న ప్ర‌చారం ఒక కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన‌ట్లుగా చెప్పారు. టోట‌ల్ వైన్ అండ్ మోర్ అనే చైన్ లిక్క‌ర్ వ్యాపార‌వేత్త అయిన ట్రోన్ 2016లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈసారి ఎలా అయినా గెల‌వాల‌న్న ల‌క్ష్యంతో ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఆయ‌న‌.. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా విప‌రీతంగా ఖ‌ర్చు చేశారు. ట్రోన్ రూ.65కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. అరుణ రూ.16 కోట్లు ఖ‌ర్చు చేశారు.

తాజా విజ‌యం అనంత‌రం ఈ న‌వంబ‌రు 6న జ‌రిగే ఎన్నిక‌ల్లో ట్రోన్ రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి అమీ హోబ‌ర్ ను ఎదుర్కొంటారు. అందులో విజ‌యం సాధిస్తే.. కాంగ్రెస్‌కు స‌భ్యుడ‌వుతారు. రెండేళ్ల ప‌ద‌వీ కాలంలో నెల‌కు రూ.1.19 కోట్ల వేత‌నాన్ని పొందే వీలుంది. ఇదిలా ఉంటే.. ప్రైమ‌రీల‌కు పోటీ చేసిన ఐదుగురు భార‌త సంత‌తి అభ్య‌ర్థులు ఓట‌మికి గుర‌య్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. న్యూయార్క్ లో మ‌రో సంచ‌ల‌న ఫ‌లితం వెలువ‌డింది. అక్క‌డ తొలిసారి డెమొక్ర‌టిక్ పార్టీ నుంచి ఒక సోష‌లిస్టు విజ‌యం సాధించారు.