Begin typing your search above and press return to search.

అమెరికా చ‌ట్ట‌స‌భ‌లో తెలుగ‌మ్మాయ్‌!

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:50 AM GMT
అమెరికా చ‌ట్ట‌స‌భ‌లో తెలుగ‌మ్మాయ్‌!
X
కాలం మారింది. ఎప్పుడేమైనా జ‌ర‌గొచ్చు. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తే.. అంద‌నిదంటూ ఏమీ ఉండ‌ద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఒక తెలుగ‌మ్మాయి అమెరికాకు వెళ్ల‌టం వ‌ర‌కూ ఆలోచిస్తే.. మ‌రికొంద‌రు అక్క‌డ జాబ్ చేయాల‌న్న వ‌ర‌కూ వెళ‌తారు. కానీ.. అరుణా మిల్ల‌ర్ మాత్రం అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వెళుతూ చ‌రిత్ర సృష్టిస్తున్నారు.

ఏడేళ్ల వ‌య‌సులో హైద‌రాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ఈ తెలుగ‌మ్మాయి.. 53 ఏళ్ల వ‌య‌సులో అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. చిన్న‌వ‌య‌సులో అమెరికాకు వ‌చ్చిన అరుణ‌.. అమెరికాలోనే స్థిర‌ప‌డ్డారు. సివిల్ ఇంజ‌నీరింగ్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. వాషింగ్ట‌న్ డీసీలోని మేరిలాండ్ నుంచి ప్ర‌తినిధుల స‌భ‌కు డెమొక్రాట్ల త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు.

డెమొక్రాట్ల‌కు కంచుకోట లాంటి మేరిలాండ్ ప్ర‌తినిధుల స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన అరుణ‌.. అందుకు ముందు త‌న ప్ర‌త్య‌ర్థి.. సొంత పార్టీకి చెందిన డేవిడ్ ట్రోన్ భారీగా ఖ‌ర్చు చేసినా ఎన్నికల్లో నిల‌వ‌లేక‌పోయారు. వ్యాపార దిగ్గ‌జ‌మైన డేవిడ్ పోటీకి ధీటుగా ఆమె సాదాసీదాగా ఉండ‌టం.. త‌న మ‌ద్ద‌తుదారులు ఇచ్చిన కొద్దిపాటి మొత్తంతో ప్ర‌చారం చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటున్నారు. రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న మ‌ద్ద‌తుతో చ‌ట్ట‌స‌భ‌కు వెళ్లే అరుదైన అవ‌కాశాన్ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

2010లో హౌస్ ఆఫ్ డెలిగేట్స్ కు ఎన్నికైన ఆమె.. త‌న ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్నారు. ఇదే ఇప్పుడామెకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు. మ‌రోవైపు.. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీపై అమెరికాలోని ప్ర‌ముఖ ప‌త్రిక వాషింగ్ట‌న్ పోస్ట‌/ ఒక ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్రచురించింది. 10 మిలియ‌న్ కోట్ల డాల‌ర్ల మ‌నిషి డేవిడ్‌ను అరుణ ఎదుర్కోగ‌లుగుతుందా? అంటూ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

డ‌బ్బున్న ఆసామి వ‌ర్సెస్ సామాన్యురాలి మ‌ధ్య న‌డుస్తున్న పోటీ ఇప్పుడు అమెరికాలోని ప‌లువురి దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న ప్రాథ‌మిక ఎంపిక‌లో అరుణ ఎంపిక ఖాయ‌మ‌ని చెబుతున్నారు. న‌వంబ‌రులో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఆమె గెలుపు ఖాయ‌మ‌ని.. వ‌చ్చే జ‌న‌వ‌రిలో ఆమె చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగు పెడ‌తార‌ని చెబుతున్నారు. అమెరికాలో తెలుగు అరుణోద‌యం మ‌రెన్ని వార్త‌ల‌కు తెర తీస్తుందో చూడాలి.