Begin typing your search above and press return to search.

అరుణాచల్ ప్రదేశ్ సీను ఇక్కడ రిపీట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   18 July 2016 5:30 PM GMT
అరుణాచల్ ప్రదేశ్ సీను ఇక్కడ రిపీట్ అవుతుందా?
X
అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారమే నిదర్శనమని చెబుతూ ఇక్కడా భవిష్యత్తులో అలాంటి పరిణామాలు జరగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడి మాజీ ముఖ్యమంత్రి దోర్నీ ఖండూ కుమారుడైన పెమా ఖండు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే... అంతకుముందు అక్కడ రాష్ట్రపతి పాలన కొద్దికాలం పాటు ఉంది. అంతకుముందు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ఆ పార్టీ నేతలు చాలామంది బీజేపీలోకి ఫిరాయించడంతో బీజేపీ బలం పెరిగింది. అయితే... ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో రాష్ర్టపతి పాలన వరకు వచ్చింది. కానీ.. సుప్రీం కోర్టు అక్కడి ప్రభుత్వ పునరుద్ధరణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చింది. అయితే.. విచిత్రంగా బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ నేత పెమా ఖండుకు మద్దతిచ్చి ఆయన్న సీఎం చేశారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తే.. ఇక్కడ విపక్షంలో ఉన్న జగన్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. తండ్రి మరణానంతర పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని మొదటి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధించి కాంగ్రెస్ కంటే బలమైన పార్టీగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. కానీ.. అధికార పార్టీ రాజకీయాల్లో భాగంగా జగన్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ ఏమవుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో అధికార టీడీపీ కూడా జగన్ - ఆయన పార్టీల పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నాయి.

కానీ... అరుణాచల్ ప్రదేశ్ ఉదాహరణతో రాజకీయ విశ్లేషకులు ఏమో.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చంటున్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లినవారితో పాటు టీడీపీ నుంచి కూడా కొత్తగా ఎవరైనా వైసీపీలోకి వచ్చినా రావచ్చంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే మళ్లీ జగన్ వద్దకే అంతా వస్తారని అప్పుడు అరుణాచల్ సీను ఇక్కడా రిపీటవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో భవిష్యత్తే చెప్పాలి.