Begin typing your search above and press return to search.

పేకాట కేసులో ట్విస్ట్.. సుమన్ ను మించిన అగర్వాల్

By:  Tupaki Desk   |   6 Nov 2021 8:30 AM GMT
పేకాట కేసులో ట్విస్ట్.. సుమన్ ను మించిన అగర్వాల్
X
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్ లో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కీలక సూత్రధారిగా గుత్తా సుమన్ ను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ సుమన్ అనే వ్యక్తి ఫాంహౌస్ లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో ఓవైపు విచారణ కొనసాగుతుండగానే బేగంపేటలో పేకాట ఆడుతూ మరికొందరు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగలకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్టు.. నగరంలోని వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్ కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతున్నట్టు.. వాట్సాప్ లో ఇన్విటేషన్ తోపాటు లోకేషన్ షేర్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ అగర్వాల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరవింద్ అగర్వాల్ తోపాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అరవింద్ అగర్వాల్ వెనుకాల నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నాయకుడి అండదండలతో అగర్వాల్ స్వేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నాడని.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డపై పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ దాడుల్లో 30 మందికి పైగా పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.