Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇవేం మాటలు కేటీఆర్.. అంతలా అనేస్తున్నారు?

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:10 PM GMT
వామ్మో.. ఇవేం మాటలు కేటీఆర్.. అంతలా అనేస్తున్నారు?
X
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో సంచలనం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిప్పులు కురిపించే మాటలతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. నోటి మాటలతో ఒంటికి కారం రాసిన ఫీలింగ్ తేవటంలో ఆయనకు ఆయనే సాటిగా చెప్పాలి. బండి సంజయ్ ముందు వరకు పద్దతిగా మాట్లాడే బీజేపీ నేతలకు భిన్నంగా.. రానున్న రోజుల్లో బీజేపీ నుంచి వచ్చే నేతలు ఎలా ఉండాలన్న దానికి మార్గదర్శనం చేసేలా అర్వింద్ తీరు ఉందంటున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక నుంచి కేసీఆర్ ఫ్యామిలీపై తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. తాజాగా తమ కార్యకర్త అభిషేక్ పై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై ప్రెస్ మీట్ పెట్టి.. మాటలతో ఉతికినంత పని చేశారు. మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ప్రతి అంశంపైనా తీవ్రంగా స్పందించిన అరవింద్.. మాటల మధ్యలో కేటీఆర్.. కేసీఆర్.. కవిత.. హరీశ్ లపైనా విరుచుకుపడ్డారు.

‘‘నువ్వో మంత్రిగి ఉండి.. మీ అయ్య పెట్టిన భిక్ష. మీ నాయన తెలంగాణ ఉద్యమం కోసం కేంద్రం కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని నీరుకారుస్తుందని రాజీనామా చేయటానికి రెఢీ అయితే..ఈయన అమెరికాలో ఏదో కూలి పనేదో చేసుకుంటున్నాడు. ఈయన చెప్పిన మాటలేందంటే.. అది వచ్చేదా? పోయేదా? కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్నాడు అంటూ నాయనని అనరాని మాటలు అన్నోడు. తెలంగాణ మీద ఈయనకు ఉన్న కమిట్ మెంట్. ఇయాల ఈయన వచ్చి మంత్రి పదవిలో కూర్చున్నాడు. డిఫ్యాక్టో చీఫ్ మినిస్టర్. వాళ్ల నాయన ఎటూ పని చేయడు. ఆఫీసర్లు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా ఈయన చుట్టూ తిరుగుతుంటారు. ఈయన చుట్టూ తక్కువ తిరుగుతున్నారు. సంతోష్ చుట్టూ ఎక్కువ తిరుగుతున్నారని.. ఫస్ట్రేషన్ తో ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అని ఫైర్ అయ్యారు.

అక్కడితో ఆగని ఆయన మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ కార్యకర్త గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు. మీ నాయన తెలంగాణ కోసం రాజీనామా చేస్తానంటే వద్దన్నోడివి.. నీకు బీజేపీ కార్యకర్త గురించి మాట్లాడటమా? చిల్లర రాజకీయాలు చేస్తున్నాడా కార్యకర్త. నువ్విచ్చే పదివేలు నీ జేబులో నుంచి ఇస్తున్నావా? అది ప్రజల సొమ్ము. కాళేశ్వరంలోకి వెళ్లి 20..30 శాతం పర్సెంటేజ్ తీసుకొని.. మైహోం వాళ్లకు వేల కోట్ల రూపాయిల ల్యాండ్ లు అప్పజెప్పేసి.. ఆడికెళ్లి పైసలు ఎత్తుకెళ్లిపోయినోడివి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్ డిజిస్టర్ ఫండ్ లో నుంచి రూ.224 కోట్ల నుంచి ఇచ్చి ఉంటావ్. ప్రభుత్వ పైసలు ఇస్తున్నావ్. ప్రజలు పన్నులు కట్టిన పైసల్లో నుంచి నీకు.. నీ నాయనకు..నీ చెల్లికి.. నీ బావకి.. నీ ఇంకో బావకి ప్రజలు కట్టే పన్నుల్లో నుంచే మీకు జీతాలు వస్తున్నాయ్. అవే పైసలతో నువ్వు.. పది వేలు పంచుతున్నావ్. దాన్ని డబ్బా కొట్టుకుంటున్నావ్’’ అని ఫైర్ అయ్యారు.

‘‘పది మంది మహిళల్ని ఎగేసుకుపోయి ధర్నా చేస్తున్నారట.. ఈయన భాష చూడండి. మహిళల మీద ఈయనకున్న గౌరవం ఏంది? మహిళల పట్ల ఈయన వాడే భాషేంది? ఈయనొక కేసీఆర్ కొడుకేగా? ఇంతకు మించిన భాషను ఎక్స్ పెక్టు చేయగలమా? ఈయన అహంకారమేంది? బీజేపీ కార్యకర్త కమిట్ మెంట్ ఏమిటన్నది కల్వకుంట్ల రామారావు రుజువు చేసిండు. ప్రజల తరఫున బీజేపీ కార్యకర్త పోరాడతాడని. పండుకోలేదు మీ నాయన లెక్క ఫాంహౌస్ లో. తనకు పదివేలు పరిహారం వచ్చినా.. రానోళ్ల కోసం పోరాడాడు. ప్రజల కోసం కోట్లాడాడు. అతడికి ముందు క్షమాపణ చెప్పు నువ్వు’’ అంటూ మండిపడ్డారు.

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓడకపోతే అప్పుడు అడగాలన్నారు. ‘‘ఖబడ్డార్ కేటీఆర్. దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం. సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే నన్ను అడుగు. నువ్వు మగాడివి అయితే.. బీజేపీ కార్యకర్త అభిషేక్ కు క్షమాపణలు చెప్పాలి’’ అని పేర్కొన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత మీద కేటీఆర్ మాటల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రెస్ మీట్ లో కిర్లోస్కర్ కమిటీ గురించి మాట్లాడారని.. గతంలో ఇదే కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కిర్లోస్కర్ కమిటీ చేసిన సూచనలు ఆచరణ సాధ్యం కాదన్నారంటూ దానికి సంబంధించిన నోట్ ను చదివి వినిపించారు. గుజరాత్ లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు 2లక్షలఅక్రమ కట్టడాల్ని కూల్చేశారని.. అదే ఏడాదిజరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లను సొంతం చేసుకున్నారన్నారు. పాతబస్తీలో పాన్ డబ్బాను కదిలించాలన్నా కేటీఆర్ ఫ్యాంటు తడుపుకుంటాడని.. ఓవైసీకి అంతలా భయపడతారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇంత ఘాటుగా వ్యాఖ్యలుచేసిన అరవింద్ పై కేటీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.