Begin typing your search above and press return to search.

ధ్యానం కోసం లీవ్ తీసుకుంటున్న సీఎం

By:  Tupaki Desk   |   29 July 2016 7:43 AM GMT
ధ్యానం కోసం లీవ్ తీసుకుంటున్న సీఎం
X
నిత్యం వార్తల్లో నిలవటం అంత తేలికైన విషయం కాదు. అందునా జాతీయ మీడియాలో దర్శనం ఇవ్వటం కష్టమైన పనే. కానీ.. తన మాటలతో.. చేతలతో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిత్యం మీడియాలో దర్శనమిస్తుంటారు. దీనికి తోడు ఆయన తలపడేది దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రధాని మోడీతో. ఆయనతో ముఖాముఖి పోరు కోసం నిత్యం తపించే ఆయన.. మోడీ మాట వినిపిస్తే చాలు అంతెత్తున ఎగిరెగిరి పడతారు. కేజ్రీవాల్ మాటలకు ప్రధాని మోడీ రెస్పాండ్ కాకున్నా.. కేజ్రీవాల్ మాత్రం వదిలిపెట్టారు. కొన్నిసార్లు అయితే ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంటారు.

ఈ మధ్యనే ప్రధాని మోడీ తనను చంపేయాలని అనుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. తనను తదుముట్టించేంతవరకూ మోడీ విశ్రమించరన్నట్లుగా ఆయన తీవ్రస్వరంతో మండిపడ్డారు. ఇలా.. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే కేజ్రీవాల్ 12 రోజుల పాటు వీటన్నింటికి దూరంగా ఉండనున్నారు. ధ్యానం మీద శిక్షణ తీసుకోవటం కోసం ఆయన తాజా లీవ్ తీసుకోనుండటం గమనార్హం.

గతంలో తీవ్ర దగ్గుతో బాధ పడిన ఆయన్ను.. బెంగళూరు వెళ్లి నేచురోపతి చికిత్స తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించటం.. అందుకు తగ్గట్లే వెళ్లిన కేజ్రీవాల్ తాజగా ధ్యానం కోసం పన్నెండు రోజులు లీవ్ తీసుకోనున్నారు. ఇందుకోసం నాగపూర్ లోని మెడిటేషన్ సెంటర్లో ఆగస్టులో పన్నెండు రోజులు విపసన ధ్యానంలో శిక్షణ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ధ్యానం కోసం శిక్షణ కోసం ఆయన ఈ నెల 30న మెడిటేషన్ సెంటర్ లో పేరు నమోదు చేసుకుంటారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కేజ్రీవాల్ లీవ్ లో ఉన్న సమయంలో ఆయన బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేపట్టనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నెండు రోజుల పాటు అధికారానికి.. ప్రజలకు దూరంగా ఉండటం ఈ ‘సామాన్యుడి’కి మాత్రమే సాధ్యమేమో..?