Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్.. ‘చీపురు’ బయటకు తీయాల్సందే!

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:08 AM GMT
కేజ్రీవాల్.. ‘చీపురు’ బయటకు తీయాల్సందే!
X
నిజాలను ఎంతోకాలం దాచడం సాధ్యం కాదు. తన నివాసంలో తన సమక్షంలో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టినట్టుగా చీఫ్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదుచేసిన తర్వాత.. తన పార్టీ దానిని ఖండించినప్పటికీ... ముఖ్యమంత్రి కే్జ్రీవాల్ మౌనం పాటించడమే కరెక్టు కాదు. కానీ ఆయన మౌనంగానే ఉండిపోయారు. ఆయన మౌనం పాటించినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా? కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు సలహాదారు అయిన వీకే జైన్.. ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీని కొట్ఠడం తాను కళ్లారా చూశానంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత.. కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నం అయింది.

చీఫ్ సెక్రటరీ పై ఎమ్మెల్యేలు దాడిచేసిన వ్యవహారం ఆఫ్ కొంప ముంచేలా కనిపిస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు అంతా భాజపా చేస్తున్న కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నప్పటికీ.. సీఎం సలహాదారు ఇచ్చిన వాంగ్మూలం కీలకం. బహుశా వీకేజైన్ వాంగ్మూలానికి సీఎం కేజ్రీవాల్ అనుమతి కూడా ఉంటుందనే అనుమానాలు కూడా పలువురిలో ఉన్నాయి.

అయితే సివిల్ సర్వీస్ అధికారిగా ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించిన కేజ్రీవాల్ నుంచి పాజిటివ్ రాజకీయాలను ప్రజలు ఆశించారే తప్ప.. ఇలాంటి గూండా రాజకీయాలను కాదు. ఆయన ఘటన జరిగిన తర్వాత ఇప్పటిదాకా మౌనం పాటించినా, ఇప్పుడిక బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పార్టీ పెట్టి, తన పార్టీ గుర్తు చీపురుతో అవినీతి మయమైన కాంగ్రెసు పార్టీని ఢిల్లీనుంచి ఊడ్చిపెట్టేసిన కేజ్రీవాల్ అదే తరహాలో ఇప్పుడు తలుపు మూలన ఉంచబడిన చీపురును బయటకు తీసి, తన సొంత పార్టీలో ప్రబలుతున్న క్రమశిక్షణ రాహిత్యాన్ని దందాలను అక్రమార్కులను కూడా ఊడ్చి పారేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ చిత్తశుద్ధి మీద ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది. సహచర రాజకీయ నాయకులకు కూడా నమ్మకం ఉంది. అందువల్లనే ఆయన దక్షిణాది దాకా కార్యక్రమాలకు అతిథిగా కూడా రాగలుగుతున్నారు. అలాంటి కేజ్రీవాల్.. ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలంటే.. చీపురు బయటకు తీసి.. అరాచక ఎమ్మెల్యేలను ఊడ్చేయక తప్పదని అంతా అంటున్నారు.