Begin typing your search above and press return to search.

ఢిల్లీ జనాల్ని బయటకు రావొద్దన్న సీఎం

By:  Tupaki Desk   |   7 Nov 2016 6:45 AM GMT
ఢిల్లీ జనాల్ని బయటకు రావొద్దన్న సీఎం
X
వినాయకచవితి చేస్తే కాలుష్యం.. హోలీ ఆడితే కాలుష్యం.. దీపావళి పండగ చేసుకుంటే భయంకరమైన కాలుష్యమని చెప్పే వారు.. ప్రచారం చేసే వారు.. నిజంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయే దేశ రాజధాని ఢిల్లీ మహానగరం గురించి పెద్దగా మాట్లాడరు. ఇప్పుడా నగరం పరిస్థితి ఏమిటంటే.. కేవలం కాలుష్యం కారణంగా జనాలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని దుస్థితి. ఇప్పటివరకూ ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. వర్షాలు భారీగా కురుస్తున్నాయి కాబట్టి ప్రజల్ని బయటకు రావొద్దని చెప్పటం విన్నాం.

కానీ.. ఇప్పుడు కాలుష్య భూతం కారణంగా ఇంట్లో నుంచి అత్యవసరం అయితే తప్పించి బయటకు అడుగు పెట్టొద్దని ఏకంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించటం చూస్తే.. దేశ రాజధాని ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యం కారణంగా.. ఢిల్లీలోని స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవుల్ని ప్రకటించటం తెలిసిందే.

తాజాగా.. ఢిల్లీ ప్రజలు చాలా ముఖ్యమైన పని ఉంటే తప్పించి ఇళ్లల్లోనే ఉండాలని బయటకు రావొద్దని చెప్పటమే కాదు.. గతంలో వాహనాల విషయంలో అమలు చేసిన సరి.. బేసి విధానాన్ని కూడా అమలు చేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. స్కూళ్లకు కాలుష్య సెలవులు ఇచ్చేసిన కారణంగా ఢిల్లీలోని సుమారు 16 వేల స్కూళ్లు మూతబడటంతో పాటు.. 10 లక్షల మంది విద్యార్థులు.. వేలాది మంది ఉపాధ్యాయులు.. సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇక.. పనుల నిమిత్తం ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన వారికి కళ్లల్లో మంట.. శ్వాసకోశ సమస్యలతో పాటు.. తీవ్ర అనారోగ్యానికి ఇట్టే గురి అవుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. గాలిలో తీవ్రస్థాయికి పెరిగిపోయిన దుమ్ము.. ధూళిని తగ్గించేందుకు కృత్రిమ వర్షాన్ని కురిపించాలన్న ఆలోచనలో ఢిల్లీ రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు.. ఢిల్లీ నగర కాలుష్యానికి కారణంగా భావిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. డీజిల్ జనరేటర్ల వినియోగం మీదా ఐదు రోజులు బ్యాన్ విధించారు. ఇక.. చెత్తను కాల్చే విషయంలోనూ ఆంక్షలు విధించారు. ఢిల్లీలో తాజా పరిస్థితిని ఒక్కమాటలో చెప్పాలంటే..‘‘కాలుష్య ఎమర్జెన్సీ’’లో దేశ రాజధాని చిక్కుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/