Begin typing your search above and press return to search.

పోకిరీకి ఢిల్లీ అమ్మాయి పంచ్ అదిరింది

By:  Tupaki Desk   |   25 Aug 2015 4:19 AM GMT
పోకిరీకి ఢిల్లీ అమ్మాయి పంచ్ అదిరింది
X
తన మానాన తాను వెళ్లే ఓ అమ్మాయిని.. ఓ పోకిరీ వేధించాడు. మాటలన్నాడు. కాస్త తేడాగా మాట్లాడాడు. అంతే అమ్మాయికి కోపం వచ్చేసింది. అతగాడి ఫోటో.. వెహికిల్ నెంబరు ఫోటో తీసేసింది. ఈ చర్యకు అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఏం కంప్లైంట్ ఇస్తావా? మరోసారి కలిసినప్పుడు ఏం చేస్తానో తెలుస్తుందంటూ బెదిరించాడు. చంపుతాననంటూ హద్దులన్నీ దాటేశాడు.

సాధారణంగా ఇలాంటి బెదిరింపులు విన్న వెంటనే బెదిరిపోతారు. భయపడతారు. కానీ.. ఈ ఢిల్లీ అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యింది. తన దగ్గరున్న ఫోటోల్ని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని వివరంగా వెల్లడించింది. ధైర్యంగా తనకు ఎదురైన వేధింపులకు పోలీసులు స్పందించటం.. ఆ పోకిరీని పట్టుకోవటం జరిగిపోయింది. దీంతో.. ఇప్పుడా ఢిల్లీ అమ్మాయి ధైర్యానికి అందరూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఆ ఢిల్లీ అమ్మాయి పేరు జస్లీన్ కౌర్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది.

తిలక్ నగర్ లోని రోడ్డును దాటే సమయంలో.. రెడ్ సిగ్నల్ ఉన్నా సరబ్ జీత్ తన వెహికిల్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతడ్ని వారించిన జస్లీన్.. భయ్యా సిగ్నల్ పడింది అగొచ్చుగా అంది. దానికి అతగాడు.. నాతో వస్తే.. నిన్ను జనక్ పురి వద్ద డ్రాప్ చేస్తానన్నాడు. దీంతో సీరియస్ అయిన జస్లిన్.. తన ఫోన్ తో ఫోటోలు తీసింది.

దీనికి మరింత చెలరేగిపోయిన అతగాడు.. ఏంటి ఫోటోలు తీస్తావా? నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ రెచ్చిపోయాడు. తనకు జరిగిన ఉదంతాన్ని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేయటంతో పోలీసులే కాదు.. ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయాన్ని విసృతంగా ప్రచారం చేసింది. అంతే.. ఢిల్లీ మహానగరంలో సదరు పోకిరీ ఆచూకీ దొరికింది. అతడ్ని రాజౌరీ గార్డెన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. జస్లిన్ ను అభినందించారు. తాజాగా ఆమె ధైర్యానికి పోలీసు శాఖ ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. మొత్తానికి అత్యుత్సాహంతో.. ఓవర్ యాక్షన్ చేస్తున్న ఒక వెధవకు.. జస్లిన్ భలేగా బుద్ధి చెప్పింది కదూ.