Begin typing your search above and press return to search.

ఆ సీఎం అంట్లు కడిగారు

By:  Tupaki Desk   |   18 July 2016 8:20 AM GMT
ఆ సీఎం అంట్లు కడిగారు
X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంట్లు కడిగారు. ఇదేంటని అనుకుంటున్నారా...? పంజాబ్ ఎన్నికల కోసం సిద్ధం చేసిన తమ ఎన్నికల మేనిఫెస్టోలో పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని అవమానించేలా పొరపాటున చిత్రం ముద్రించడంతో అందుకు పరిహారంగా ఆయన స్వర్ణదేవాలయంలోనే సేవ చేసేందుకు స్వచ్ఛంగా నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఆ ఆలయ వంటగదిలో ఆయన అంట్లు కడిగారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన '51 పాయింట్ యూత్ మ్యానిఫెస్టో' ముఖచిత్రంపై గోల్డెన్ టెంపుల్ చిత్రం వాడారు. అయితే, దాని పక్కన పార్టీ సింబల్ చీపురు బొమ్మ కూడా ముద్రించారు. దీంతో ఆప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఓ మతానికి చెందిన చిత్రం ప్రింట్ అయిందని వెల్లడించిన ఆయన అక్కడితో ఆగకుండా ఈ ఉదయం గోల్డెన్ టెంపుల్ కు వచ్చి - స్వీయశిక్షగా - అక్కడ పని చేశారు. టెంపుల్ ప్రాంగణంలో గిన్నెలు కడిగారు. అక్కడి కిచన్ లోకి వెళ్లి వాడిన వంటపాత్రలను శుభ్రం చేశారు. ఆ తరువాత ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కాగా మహిమ గల ఆలయంగా పేరున్న స్వర్ణ దేవాలయానికి అపచారం జరిగేలా మానిఫెస్టోలో బొమ్మ ముద్రించడం వల్ల నష్టం జరుగుతుందని కేజ్రీ ఆందోళన చెందారని.. ఆ కారణంగానే ఎవరూ డిమాండ్ చేయకుండానే ఆయన స్వీయ శిక్ష విధించుకుని గిన్నెలు కడిగారని భావిస్తున్నారు. ఆ తరువాత ఆయన పూజలు చేయడం.. "అనుకోకుండా జరిగిన తప్పది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది" అని చెప్పడం ఆధారంగా ఆయన దైవ భయంతోనే ఇలా ఆందోళన చెందినట్లుగా భావిస్తున్నారుు. కేజ్రీవాల్ కేవలం వంట పాత్రలు కడగడమే కాకుండా ప్రసాదం తయారీలోనూ పాలుపంచుకున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో సిక్కుల మనసు గెలుచుకునేందుకు కూడా ఆయన ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.