Begin typing your search above and press return to search.

హస్త ప్రయోగం పై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   11 Feb 2020 6:00 AM GMT
హస్త ప్రయోగం పై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం
X
కళాశాల వార్షికోత్సవంలో అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. అమ్మాయిల వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం చేయడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

ఢిల్లీలోని గార్గి కాలేజీ లో గురువారం వార్షిక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో ఓ అల్లరి మూక చొరబడి విద్యార్థినుల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డారు. కళాశాలలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించగా దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు రాత్రి క్యాంపస్‌లోకి చొరబడ్డ దాదాపు 30-35 మంది మూక విద్యార్థినులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల వైపు చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డారు. క్యాంపస్‌ లో విద్యార్థినులను వెంబడించి దాడికి పాల్పడ్డారు. అయితే వారంతా మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడంతో ఖంగు తిన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలిపారు. మన బిడ్డలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. మహిళా భద్రతపై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేజ్రీవాల్ పలు హామీలు ఇచ్చారు. గార్గి కాలేజీలో జరిగిన ఘటనను హౌజ్ ఖాన్ పోలీసులు సమోటో కేసుగా స్వీకరించి విచారణ ప్రారంభించారు. సీనియర్ పోలీస్ అధికారిణి గీతాంజలి ఖండెల్వాల్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరగనుంది.

అయితే కళాశాల యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వారు క్యాంపస్ లోపలికి ప్రవేశించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. గార్జి కళాశాలకు జాతీయ మహిళా కమిషన్ తమ బృందాన్ని పంపించింది.