Begin typing your search above and press return to search.

మెట్టుదిగిన గ‌వ‌ర్న‌ర్‌...బెట్టువీడిన సీఎం

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:16 AM GMT
మెట్టుదిగిన గ‌వ‌ర్న‌ర్‌...బెట్టువీడిన సీఎం
X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గ‌త తొమ్మిది రోజులుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికార నివాసం రాజ్ నివాస్‌ లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తన డిప్యూటీ మనీష్ సిసోడియా - మంత్రులు సత్యేంద్ర జైన్ - గోపాల్ రాయ్‌ లతో కలిసి రాజ్ నివాస్‌ లోని వెయిటింగ్ రూమ్‌ లో ధర్నాకు దిగారు. ఢిల్లీ ఓటర్లను శిక్షిస్తున్న వాళ్లపై తాను చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ ఇదని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. తాను ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రాజ్ నివాస్‌ ను వదిలి వెళ్లేది లేదని ఆయన స్పష్టంచేశారు. ఎట్ట‌కేల‌కు మంగళవారం తన దీక్షను విరమించారు.

ఏడు రాత్రులుగా నలుగురూ ఆ రూమ్‌లోని సోఫాలపైనే పడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో ఇలా ఓ గవర్నర్‌ కు వ్యతిరేకంగా సీఎం ధర్నా చేయడం ఇదే తొలిసారి. ఇది ఇలాగే కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ ను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం సరిగా పనిచేయకుండా చేస్తున్నారని కేజ్రీవాల్ - ఆయన మంత్రులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే సీఎస్‌ పై తాము దాడి చేశామంటూ బ్యూరోక్రాట్లు ఎవరూ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులందరినీ ప్రభుత్వానికి సహకరించాలని ఎల్‌జీ ఆదేశించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పారు. ``మూడు నెలలుగా వాళ్లు మా సమావేశాలకు రావడం లేదు. మా ఆదేశాలను పాటించడం లేదు. ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం ఎక్కడైనా చూశారా? ఇలాంటి కుట్రలు ఆపాలని ఎల్‌ జీని కోరినా ఆయన మాత్రం తన బాస్ సూచనల మేరకు పనిచేస్తున్నారు. నాకు ధర్నా చేయడం తప్ప మరో దారి లేకుండా పోయింది`` అని కేజ్రీవాల్ అన్నారు. అయితే మంచి సోఫాలపై కూర్చొని ధర్నా చేస్తున్నామని, తన జీవితంలో చేసిన అత్యంత సౌకర్యవంతమైన ధర్నా ఇదే అని ఆయన జోక్ కూడా చేశారు.

కాగా, ఈ ఆందోళ‌న‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి జులక్ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ ఇంట్లో ధర్నా చేసేందుకు మీకెవరు అధికారం ఇచ్చారని హైకోర్టు సీఎం కేజ్రీని ప్రశ్నించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మంగళవారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసింది. అత్యవసరంగా సచివాలయంలో అధికారులతో సమావేశమవ్వాలని సీఎంను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అందులో కోరారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని లేఖలో వివరించారు. దీంతో కేజ్రీవాల్ ధ‌ర్నా విర‌మించారు.