Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టులు సిగ్గులేని వారు: కేజ్రీవాల్‌

By:  Tupaki Desk   |   31 Jan 2017 7:14 AM GMT
జ‌ర్న‌లిస్టులు సిగ్గులేని వారు: కేజ్రీవాల్‌
X
ఈ ప్ర‌పంచంలో విశ్వాసం లేన వారు జ‌ర్న‌లిస్టులే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమ‌ర్శించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మీడియాపై విరుచుకుపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెల‌వడం కష్టమేనని మీడియా సర్వేల్లో తేలడంతో.. అవన్నీ ‘‘నకిలీ వార్తలేననీ... డబ్బులు తీసుకుని రాస్తున్నారంటూ’’ జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. ఈ సంద‌ర్భంగా మీడియా సంస్థ‌ల‌పై - జ‌ర్న‌లిస్టుల‌పై కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

‘‘జర్నలిస్టుల ముసుగులో కొందరు మధ్యవర్తుల అవతారమెత్తారు. వారిని బహిరంగంగానే పేర్లు పెట్టి పిలిచే రోజులు వచ్చాయి. ఎవరో ఒకరు డబ్బులిస్తే తప్ప ఇలాంటి సర్వే ఫలితాలు రావు.. ఇంతకంటే సిగ్గుమాలిన విషయం ఉంటుందా’’ అని కేజ్రీవాల్ విరుచుకుప‌డ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 14 నుంచి 19 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో వెల్లడయింది. అకాలీ దళ్‌ కు 50 నుంచి 55 - కాంగ్రెస్‌ కు 45 నుంచి 50 వరకు సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడించాయి. కాగా ఈ సర్వే నిర్వహించిన ఏజెన్సీలపై విచారణ చేపట్టాలనీ.. వారిపై ఫోర్జరీ - మోసం కేసులు పెట్టాలని మరో ఆమాద్మీ నేత అశుతోష్ ట్వీట్ చేశారు.

ఇదిలాఉండ‌గా...ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణ అరవింద్‌ కేజ్రీవాల్‌ పై కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ - కాంగ్రెస్‌ ల నుంచి డబ్బులు తీసుకోండి..ఓట్లు మాత్రం మాకే వేయండి...అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 8న ఆప్‌ జాతీయాధ్యక్షుడు కేజ్రీవాల్‌ ప్రజలనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను పరిశీలించిన ఇసి ''ఆర్‌ పి యాక్టులోని సెక్షన్‌ 123(1) సెక్షన్‌ - ఐపిసి 171బి - 171ఇలను కేజ్రీవాల్‌ ఉల్లంఘించారు'' అని పేర్కొంది. ఈనెల 31 - మధ్యాహ్నం 3 గంటలకు ముందుగా దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని గోవా ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఇతర పార్టీలు ఓటుకు రూ. 5 వేలిస్తే రూ. 10 వేలు డిమాండ్‌ చేయాలని కూడా కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. తానేమీ తప్పుగా మాట్లాడలేదనీ, తన వ్యాఖ్యలకి కట్టుబడి వున్నాననీ చెప్పారు.. తన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న ఈసీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి కేజ్రీవాల్‌ లేఖ కూడా రాశారు. తాను మొదట చేసిన వ్యాఖ్యల్ని మళ్లీ కొనసాగించేలా అనుమతివ్వాలని ఈసీ కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/