Begin typing your search above and press return to search.

రోహిత్‌ ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్య‌

By:  Tupaki Desk   |   19 Jan 2016 6:31 AM GMT
రోహిత్‌ ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్య‌
X
హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య రాజ‌కీయ రంగును పులుముకొన్న ద‌శ‌ను దాటేసింది. ఇపుడు ఏకంగా జాతీయ పార్టీల నేత‌లు హెచ్‌ సీయూకు వెళ్లేలా....రోహిత్ కేంద్రంగా పాల‌కుల‌ను ఇబ్బందిపెట్టేలా ఎత్తులు వేసేలా అడుగులు వేస్తున్నారు. ఎన్డీఏ స‌ర్కారు అంటే విరుచుకుప‌డే కేజ్రీవాల్ ఇపుడు రోహిత్ ఆత్మ‌హ‌త్య‌ను అస్త్రంగా చేసుకున్నారు.

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. రోహిత్‌ ఆత్మహత్యపై ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్‌ లు చేశారు. రోహిత్‌ ది ఆత్మహత్య కాదని పేర్కొన్న కేజ్రీవాల్ అది ముమ్మాటికీ హత్యనేనని ఆరోపించారు. దళితుల ఉద్ధరణకు పాటుపడాల్సిన మోడీ ప్రభుత్వం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేసిందని దుయ్య‌బ‌ట్టారు. రోహిత్‌ ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్య, సామాజికన్యాయం - సమానత్వ హత్య అని ఆరోపించారు. దీనికి బాధ్యులైన మంత్రులను మోడీ తన కేబినేట్‌ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ కేజ్రీ ట్విట్టర్‌ లో డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండ‌గా రోహిత్‌ ఆత్మహత్య ఎపిసోడ్‌ లోకి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీకూడా ఎంట‌ర‌య్యారు. ఆత్మ‌హ‌త్య విష‌యంలో హెచ్‌ సీయూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సెలర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిన మంత్రి దత్తాత్రేయ వైఖరిని ఆయన ఖండించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు రోహిత్‌ తల్లిని పరామర్శించనున్నారు. రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ చేరికున్న తరువాత రోహిత్‌ తల్లిని పరామర్శిస్తారు. అనంతరం హెచ్‌ సియూ విద్యార్థులతో సమావేశమవుతారు.