Begin typing your search above and press return to search.

టైమ్లీ ఎత్తుగడతో మోడీని ఉక్కిరిబిక్కిరి చేసిన సీఎం

By:  Tupaki Desk   |   20 Dec 2019 5:10 AM GMT
టైమ్లీ ఎత్తుగడతో మోడీని ఉక్కిరిబిక్కిరి చేసిన సీఎం
X
మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయానికి ఢిల్లీ రాష్ట్ర రాజకీయానికి ఏ మాత్రం పోలిక ఉండదు. పేరుకు రాష్ట్రం.. ముఖ్యమంత్రి పదవే కానీ.. కేంద్రం కంట్రోల్ తో ఒక అడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీ ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఫర్లేదు కానీ.. అందుకు భిన్నంగా ఉంటే మాత్రం టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది.

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రానికి మధ్యనున్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ మాత్రం అవకాశం చిక్కినా కేజ్రీవాల్ కు చుక్కలు చూపిస్తూ ఉంటుంది కేంద్రం. మొదట్లో కేంద్రంతో కయ్యం పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించినా.. దాని కారణంగా తనకు జరిగే నష్టాన్ని గుర్తించిన కేజ్రీవాల్.. గడిచిన కొంతకాలంగా కామ్ గా ఉంటూ.. పాలన మీదనే ఫోకస్ పెట్టారు.

మరో నెలలో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్టం అనుకోని వరంగా మారింది. వరుస నిరసనలు.. ఆందోళనతో దేశ రాజధాని అట్టుడికిపోతున్న వేళ.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం కిందామీదా పడుతోంది. పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే.. ఇంటర్నెట్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇలాంటివేళ.. అనూహ్యమైన ఎత్తుగడతో కేంద్రానికి సురుకు పుట్టేలా చేశారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్. తమ ఎన్నికల హామీల్లో కీలకమైన ఫ్రీవైఫై హాట్ స్పాట్ పథకాన్ని తాజాగా ప్రారంభించారు. ఢిల్లీ వ్యాప్తంగా వంద చోట్ల ఫ్రీ హాట్ స్పాట్లను ఏర్పాటు చేస్తామన్న హామీని తాజాగా ఆయన చేతల్లోకి తీసుకొచ్చారు. కేంద్రం ఇంటర్నెట్ కనెక్టవిటీని ఆపేసిన వేళ.. అందుబాటులోకి వచ్చిన ఫ్రీ వైఫై హాట్ స్పాట్ పథకం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాము ఇప్పుడు వైఫై సర్వీసుల్ని ప్రారంభించటం యాదృచ్ఛికమే తప్పించి కేంద్రంపై పంతంతో చేసింది ఎంతమాత్రం కాదన్నా.. అసలు విషయం ఏమిటన్న విషయం అందరికి తెలిసిందే. కేజ్రీవాల్ తాజా ఎత్తుగడ గురి చూసి కొట్టినట్లుగా ఉండటమే కాదు.. ప్రధాని మోడీని ఉక్కిరిబిక్కిరి చేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది.