Begin typing your search above and press return to search.

సీఎం నామినేషన్ వేయటానికి అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందట!

By:  Tupaki Desk   |   22 Jan 2020 8:25 AM GMT
సీఎం నామినేషన్ వేయటానికి అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందట!
X
రాష్ట్రాలన్ని ఒకలా ఉండవన్నట్లే.. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోన్నోళ్ల పవర్స్ ఒకేలా ఉండవు. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి పరిస్థితి మరింత సిత్రంగా ఉంటుంది. పేరుకు రాష్ట్ర ముఖ్యమంత్రే కానీ.. ఆయన మాటకు చాలా సందర్భాల్లో సరైన విలువ ఉండని పరిస్థితి. కేంద్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి.. రాష్ట్రంలో మరో పార్టీ పవర్ లో ఉందా? ఇక.. ఆ సీఎంకు చుక్కలే చుక్కలు. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలుపొందిన ఆయన.. గడిచిన కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టటం తగ్గించి.. తన సమయమంతా ఢిల్లీ రాష్ట్రం మీదనే పెడుతున్నారు. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో చేతిలో ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని తపిస్తున్న ఆయనకు పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురవుతున్నాయి. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు కోసం వెళ్లిన ఆయనకు సిత్రమైన అనుభవం ఎదురైంది.

సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ముఖ్యమంత్రిగా ఉన్న నేత నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుంటే.. ఏర్పాట్లు పక్కాగా ఉండటమే కాదు.. ఆయనకు కించిత్ అసౌకర్యం ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. అలాంటివేమీ ఢిల్లీలో ఉండవు మరి. సీఎం కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే సరికి.. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ఉండటం.. వారితో పాటుగా సీఎంను కలిపేసిన అధికారులు.. ఆయన చేతికి ఒక వెయిటింగ్ టోకెన్ ఇచ్చారు. చివరకు మూడు గంటల తర్వాత.. ఆయన వంతు రాగా వెళ్లి.. తన నామినేషన్ దాఖలు చేశారు.

జరిగినదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ అయి.. ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తే.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం జరిగిన పరిణామాన్ని లైట్ తీసుకొని.. ప్రజాస్వామ్యంలో.. ఒకేచోట ఇంతమంది పోటీ చేస్తున్నారంటే అంతకు మించి ఏం కావాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లాంటి అర్బన్ ప్రాంతంలోని ఓటర్ల నాడిని ఎలా టచ్ చేయాలో కేజ్రీవాల్ కు ప్రత్యేకంగా చెప్పాలా?