Begin typing your search above and press return to search.

తాగుడికి వయసు తగ్గించనున్న సామాన్యుడు

By:  Tupaki Desk   |   25 Sep 2015 3:45 PM GMT
తాగుడికి వయసు తగ్గించనున్న సామాన్యుడు
X
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకూ మద్యపానానికి 25 ఏళ్ల పరిమితి ఉంటే.. దాన్ని నాలుగేళ్లు తగ్గించాలని భావిస్తోంది. తమ సర్కారు తీసుకోనున్న ఈ నిర్ణయం గురించి ఢిల్లీ రాష్ట్ర పర్యాటక మంత్రి కపిల్ మిశ్రా స్వయంగా వెల్లడించటం ఇప్పుడు రచ్చగా మారింది.

ఒక వయసుకు వచ్చాక తాగాలా.. వద్దా లాంటి నిర్ణయాలు తీసుకునే స్వతంత్రత వస్తుందని.. ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ అభిప్రాయపడుతోంది. అందుకే.. ఇప్పటివరకూ ఉన్న 25 ఏళ్ల వయ పరిమితిని 21 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకునే ముందు ఢిల్లీ రెస్టారెంట్ల యజమానుల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని భావిస్తోంది. దీనిపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

సామాజిక మార్పు తీసుకొస్తానని అధికారాన్ని అడిగిన కేజ్రీవాల్.. ఇప్పుడు అందుకు భిన్నంగా యువతను మద్యపానానికి ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శ వినిపిస్తోంది. సామాన్యుడిగా అసమాన్యంగా పని చేయకున్నా ఫర్లేదు కానీ.. ఇలా యువత చెడు మార్గంలో పయనించేలా నిర్ణయాలు తీసుకోవటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ అంశంపై కేజ్రీవాల్ సర్కారు తుది నిర్ణయం ఏమవుతుందన్నది ఇప్పుడు ఉత్కంట రేకెత్తిస్తోంది.