Begin typing your search above and press return to search.

తనను టార్గెట్ చేయాలంటున్న సీఎం

By:  Tupaki Desk   |   15 Jun 2016 4:37 PM GMT
తనను టార్గెట్ చేయాలంటున్న సీఎం
X
భారత్ లాంటి దేశంలో సామాన్యుడు సీఎం కాగలడని వరుసగా రెండుసార్లు నిరూపించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. తొలిసారి సీఎం అయిన సందర్భంగా తన తొందరపాటుగా సీఎం పదవిని చేజార్చుకొని.. ఆ తర్వాత లెంపలు వేసుకొని మరీ ఢిల్లీవాసుల మనసుల్ని దోచుకున్న ఆయన.. రెండోసారి అత్యద్భుత మెజార్టీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. తనకొచ్చిన గెలపుతో ఢిల్లీ రాష్ట్ర వాసుల బతుకుల్ని మార్చే కన్నా.. మిగిలిన పనుల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఆయన.. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని ఆయనపై వార్ ప్రకటించారు. తన బలాన్ని తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటూ లేనిపోని అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ.. తరచూ వార్తల్లోకి ఎక్కటం ఆయనకు అలవాటుగా మారింది.

అందరిని వేలెత్తి చూపిస్తూ.. నీతులు చెప్పే ఆయన.. తాజాగా అనుకోని సమస్యలో ఇరుక్కుపోయారు. తన ఎమ్మెల్యేల్ని పార్లమెంట్ సెక్రటరీల నియమిస్తూ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన కేజ్రీవాల్.. ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. ఆయన్ను తను చేతులు జోడించి వేడుకుంటున్నానని.. తనను టార్గెట్ చేయాలే తప్పించి.. ఢిల్లీ వాసుల్ని వేధింపులకు గురి చేయొద్దంటున్నారు.

గత మార్చిలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్ని పార్లమెంటు సెక్రటరీలుగా నియమించటం.. ఇది కాస్తా రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంగా కేజ్రీవాల్ సర్కారుపై విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తాను చేసిన పనిని మరింత కవర్ చేసుకోవటానికి వీలుగా.. సవరణ బిల్లును ఢిల్లీ సర్కారు తయారు చేసింది. దీన్ని రాష్ట్రపతికి పంపితే.. దాన్ని ఆయన తిరస్కరించటంతో కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోడీ కారణంగానే రాష్ట్రపతి ప్రణబ్ బిల్లును తిరస్కరించారన్నారు.

ఇదిలా ఉంటే.. తమ ఎమ్మెల్యేల్ని పార్లమెంటు సెక్రటరీలుగా నియమించటం ద్వారా ఏదో చేయాలనుకుంటే.. మరేదో అయిన పరిస్థితి. ఎందుకంటే.. ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి నో చెప్పేయటం.. ఇదే అంశంపై ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీని సంజాయితీ కోరింది. ఆమ్ పార్టీ నేతలపై అనర్హతా వేటు ఎందుకు వేయకూడదో చెప్పాలంటూ ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ నేపథ్యంలో రియాక్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్.. తామిచ్చిన పదవులు కారణంగా ఎలాంటి లాభం చేకూరదని.. పారితోషికం లేదని వారు చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడితే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మరి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగటమా? లేదా? అన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేల అనర్హతా వేటు మీదనే ఆధారపడిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం సామాన్యుడికి షాకింగ్ గా మారిందని చెబుతున్నారు.