Begin typing your search above and press return to search.

రివర్స్ పొలిటికల్ ట్రెండ్ - నేను హిందువును !

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:30 PM GMT
రివర్స్ పొలిటికల్ ట్రెండ్ - నేను హిందువును !
X
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. రాహుల్ గాంధీ నుండి కేజ్రీవాల్ వరకు ఇప్పుడు హిందువుగా చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. మూడేళ్ళ క్రితం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దశాబ్దాలుగా హిందువులను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతున్నాయని, లౌకికవాదం పేరుతో ఆయా పార్టీలు హిందువులకు నష్టం చేసే చర్యలకు దిగుతున్నాయనేది కొంతమంది వాదన.

ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. బీజేపీ వరుస గెలుపు వెనుక వివిధ కారణాలతో పాటు హిందూ ఓటు బ్యాంకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. బీజేపీ అంటే హిందువుల పార్టీగా ముద్రపడింది. అయితే తమది సెక్యులర్ పార్టీ అని కమలనాథులు చెప్పడం వేరే విషయం.

యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకున్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో గుళ్ల చుట్టూ తిరిగారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇదీ ఒక కారణంగా చెబుతారు. 2019 లోకసభ ఎన్నికల సమయంలోను రాహుల్ గాంధీ శివభక్తుడిగా చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. అయితే సోమనాథ్ ఆలయం లో దేవుడ్ని దర్శించుకునే క్రమంలో తనను నాన్ హిందువు గా రిజిస్టర్ చేయించుకోవడం గమనార్హం.

తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా తాను అసలైన హిందువును అని చెప్పుకున్నారు. మంత్రులు, తెరాస నాయకులు తమ పార్టీ అధినేతనే అసలైన హిందువు అని చెప్పడం గమనార్హం.

ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా తాను అసలు సిసలు హిందువును అని నిరూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకి అని విపక్షాలు భగ్గుమన్నాయి. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను హనుమంతుడి కట్టర్ భక్తుడినని చెప్పారు. అంతేకాదు, ఓ కార్యక్రమం లో భాగంగా హనుమాన్ చాలీసా వినిపించారు.

ఇటీవలి కాలంలో హిందువులు ఓటు బ్యాంకుగా మారుతుండటం.. బీజేపీ మాత్రమే హిందుత్వ పార్టీగా ముద్ర పడటంతో ఓట్ల కోసం ఆయా పార్టీల నేతలు ఆలయాలను చుట్టి రావడం, తాము హిందువులుగా చెప్పుకోవడం గమనార్హం.