Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎం సమోసాల స్కాం

By:  Tupaki Desk   |   11 April 2017 7:03 AM GMT
ఢిల్లీ సీఎం సమోసాల స్కాం
X
ఢిల్లీ సీఎం - ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చిన్న సమోసా కారణంగా చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఆయన ఇలా సమోసా దెబ్బ తగలడంతో విలవిలలాడుతున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, వివాదాల్లో కూరుకుపోయిన ఆప్ కు ఈ సమోసా ఎఫెక్ట్ మూలిగే నక్కపై తాటిపండులా మారింది. ఇంతకీ... ఈ సమోసా గొడవేంటో తెలుసా..?

ఢిల్లీ ముఖ్యమంత్రి చాయ్‌ సమోసాలకు ప్రజల సొమ్ము అక్షరాలా కోటి రూపాయిలు ఖర్చుపెట్టారంటూ బీజేపీ అధికార ప్రతినిధి తాజీందర్‌ పాల్‌ సింగ్‌ ఆరోపణలకు దిగారు. ఆరోపణలంటే ఆషామాషీగా కాదు... ఢిల్లీ నగరం మొత్తం ఈ మేరకు ఆయన పోస్టర్లు వేసి ప్రచారం చేసేస్తున్నారు.

కేజ్రీ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వం తన అతిథుల కోసం 18 నెలల కాలంలో కేవలం చాయ్ సమోసాల సప్లై కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు చేసిందన్నది బీజేపీ ఆరోపణ. ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే గత ఏడాది డీటీటీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలకు రూ.11 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్‌ విచారణ చేపట్టాలన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ-ఆప్‌ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కొట్టిపారేస్తున్నారు.

డీటీటీడీసీ విందుకు సంబంధించి ఖర్చు చేసిన ఫైల్‌ ను తాను వెనక్కి తిప్పి పంపించినట్లు సిసోడియా చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఆ ఫైల్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోనే ఉందన్నారు. అయితే బీజేపీ ఒత్తిడి చేయడం వల్లే ఈ వివరాలు బయటకు వచ్చాయంటూ ఆయన మండిపడ్డారు. కాగా ఆప్‌ సర్కార్‌ చాయ్‌-సమోసా ఖర్చు కోటి దాటిందన్న సంగతి ఎలా బయటకు వచ్చిందో తెలుసా.. సామాన్యుడి అస్త్రం సమాచార హక్కు చట్టం వల్లే ఇది బయటపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/