Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్‌ పై క‌ర్ర‌లు, రాళ్ల దాడి

By:  Tupaki Desk   |   29 Feb 2016 11:24 AM GMT
కేజ్రీవాల్‌ పై క‌ర్ర‌లు, రాళ్ల దాడి
X
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పై భీక‌ర దాడికి విఫ‌ల‌య‌త్నం జ‌రిగింది. పంజాబ్‌ లోని లూథియానాలో కేజ్రీవాల్‌ పై కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే కేజ్రీవాల్ ఆ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వ‌చ్చే ఏడాది పంజాబ్ ఎన్నిక‌ల వేడి ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించేందుకు అర‌వింద్ కేజ్రీవాల్ ఐదు రోజుల పర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో చివ‌రిరోజు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంద‌ర్భంగా ఈ దాడి య‌త్నం జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోను ఒక‌టి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్....ఆయుధాలు - రాళ్ల‌తో త‌న‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని ప్ర‌స్తావించారు. గుర్తుతెలియని దుండగులు తన కారుపై దాడిచేశారని అయితే వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌య‌త్నం అయింద‌ని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ - బాదల్ వర్గీయులు ఇలాంటి చ‌ర్య‌ల‌తో త‌న‌లో పోరాట స్పూర్తిని ఆప‌లేర‌ని కేజ్రీవాల్‌ ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ దాడిపై ఆప్ వ‌ర్గాలు పెద్ద ఎత్తున స్పందించాయి. ఆప్ నేత అశిష్ ట్విట్టర్ వేదిక‌గా త‌న అభిప్రాయాలు పంచుకుంటూ ఇనుప రాడ్లు, రాళ్లతో కేజ్రీవాల్‌ పై దాడికి దిగి కారును ధ్వంసం చేయ‌డం విస్మ‌య‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. దేవుడి దయ వల్ల కేజ్రీవాల్ బతికి బయటపడ్డారన్నారు. ఈ దాడి వెనక పంజాబ్‌ ముఖ్యమంత్రి బాదల్ కుట్ర ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే గూండాలు దాడిచేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు.