Begin typing your search above and press return to search.

ఢిలీ సీఎం పదిరోజులు మాట్లాడలేరు!

By:  Tupaki Desk   |   6 Sep 2016 6:10 AM GMT
ఢిలీ సీఎం పదిరోజులు మాట్లాడలేరు!
X
రాజకీయనాయకులకు అతిపెద్ద శిక్ష ఏదైనా ఉందంటే.. అది మాట్లాడె అవకాశం లేకపోవడమే అనుకోవాలి! ఈ విషయంలో సరదాగా కూడా చాలా వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం.. నిత్యం సోషల్ మీడియాలో జోకులు పేలుతూనే ఉండటం చూస్తుంటాం. అయితే ఈ విషయంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఇబ్బందిని ఎదుర్కోనున్నారు. అయితే ఇది హాస్యానికో - సరదాగానో కాదు సుమా.. సీరియస్ గానే ఢిల్లీ ముఖ్యమంత్రి పదిరోజులపాటు మాట్లాడలేని పరిస్థితికి వెళ్లనున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొంతకాలంగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనికోసం గతంలో విపాసన - న్యూరోపతి ట్రీట్ మెంట్లకు కూడా కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇలా ఎన్ని చికిత్సలు తీసుకున్నా దగ్గు మాత్రం తగ్గకపోవడంతో.. ఆయన గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారని సమాచారం. దీంతో పదిరోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు వైద్యులు. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు.

అయితే పంజాబ్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగురోజుల ప్రచార కార్యక్రమాలను ముగించుకున్న తర్వాతే ఈ ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్న కేజ్రీవాల్ ఈ నెల 12 రాత్రికి బెంగుళూరు చేరుకుని 13న సర్జరీ చేయించుకుంటారు. దీంతో తర్వాతి 10రోజుల పాటు సీఎం ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు.