Begin typing your search above and press return to search.

ఆ సీఎం భార్య మీద వార్తల్లో నిజం లేదంట

By:  Tupaki Desk   |   14 July 2016 8:04 AM GMT
ఆ సీఎం భార్య మీద వార్తల్లో నిజం లేదంట
X
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిత్యం ఏదో ఒక అంశానికి సంబంధించి వార్తల్లో కనిపిస్తుంటారు. దురదృష్టవశాత్తు ఆయనపై మీడియాలో వచ్చే వార్తల్లో దాదాపు ఆయన్ను.. ఆయన సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేవే తప్పించి..ఆయన పేరు ప్రతిష్ఠల్ని పెంచేవి ఎంతమాత్రం కాకపోవటం గమనార్హం. బుధవారం కేజ్రీవాల్ సతీమణి.. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటం తెలిసిందే. ఇంకా పదేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ఆమె.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవటం పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఆమె అలా తన ఉద్యోగానికి రాజీనామా చేశారో లేదో.. వెంటనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం గురించి రకరకాల వార్తలు.. విశ్లేషణలు వచ్చేశాయి. కొందరేమో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె చేపట్టనున్నారని కొందరంటే.. మరికొందరు రానున్న పంజాబ్.. గోవా ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని.. ఆ ఎన్నికల కోసమే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా విశ్లేషించారు.

అయితే.. ఈ తరహా వాదనల్లోనిజం లేదని చెబుతున్నారు ఆమ్ఆద్మీ పార్టీ నేతలు. ఎందుకంటే.. తమ పార్టీ వారసత్వ రాజకీయాల్ని ఎంతమాత్రం స్వాగతించదని.. ఆ విషయం పార్టీలో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని.. అదే సమయంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలోనూ సభ్యత్వం పొందేందుకు అర్హత లేదని చెబుతున్నారు.

వారసత్వ రాజకీయాల్ని వ్యతిరేకించే తమ పార్టీ .. కేజ్రీవాల్ సతీమణి సునీత సీఎం అభ్యర్థిగా బరిలో ఉంటారన్న వార్తల్లోఅర్థం లేదని చెప్పుకొచ్చారు. అయితే.. పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందన్న మాటను మాత్రం వారు ఉండదని చెప్పకపోవటం గమనార్హం. మిగిలిన రాజకీయపార్టీల మాదిరి.. కాలానుగుణంగా.. అవసరాలకు తగ్గట్లుగా పార్టీ నిబంధనల్ని మార్చుకునే అలవాటును కేజ్రీవాల్ కూడా పాటిస్తారా? లేక.. మొదటి నుంచి చెబుతున్న ఆదర్శాలకు కట్టుబడే ఉంటారా? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సిందే.