Begin typing your search above and press return to search.

బాబు పండుగ చేసుకునేలా పొగేడేశారు

By:  Tupaki Desk   |   8 Nov 2016 2:12 PM GMT
బాబు పండుగ చేసుకునేలా పొగేడేశారు
X
కష్టపడి పని చేయటానికి కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీకి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి.. చంద్రబాబును చూస్తే.. ఆయనంత కూల్ గా ఉండటం బాబుకు రాదా? లేదా.. కేసీఆర్ అస్సలు పని చేయరా? అనిపించేలా ఉంటుంది. ఇక.. రెండు రాష్ట్రాల్లోని పాలన.. ఇద్దరు ముఖ్యమంత్రుల సమర్థత చూస్తే.. ఒకరికొకరు తీసిపోనట్లుగా ఉంటారు. కానీ.. బాబు పడినంత కష్టం మరెవరూ పడనట్లుగా ఆయన తీరు ఉంటుంది.

ఇంతలా కష్టపడుతున్నా.. ఆయనకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు తక్కువనే చెప్పాలి. మొన్నటికి మొన్న గవర్నర్ నరసింహన్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు చంద్రుళ్లు కలిశారు. చంద్రబాబు అయితే కేకు కట్ చేసి నరసింహన్ నోట్లో పెట్టి మరీ తినిపించారు. ఇంత చేసినా.. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చిన కితాబు బాబుకు ఇవ్వలేదనే చెప్పాలి. తనను కలిసిన ప్రతిసారీ కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడతారని వ్యాఖ్యానించారు.

ఇదొక్కటే కాదు.. ఆ మధ్యన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన తొలిసారి.. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి లేదని కితాబు ఇవ్వటం.. ఈ మధ్యన విడుదలైన పలు ర్యాంకింగ్ లలో తెలంగాణ తన సత్తా చాటుతోంది. ఇదంతా చూసినప్పుడు.. నిత్యం రెక్కలు ముక్కలు చేసుకొని.. క్షణం తీరిక లేకుండా తిరిగే బాబుకు.. ఎంపిక చేసిన వేదికల మీద మాత్రమే కనిపిస్తూ.. అవసరానికి తగ్గట్లు ఫాంహౌస్ లో రోజుల తరబడి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధికి సంబందించి పెద్ద తేడా ఉండటం లేదన్న భావన సగటు జీవికి వచ్చే పరిస్థితి.

తన కుటుంబానికి దూరంగా.. తనకెంతో ప్రియమైన మనమడ్ని తాను మిస్ అయినట్లుగా తరచూ చెప్పే చంద్రబాబు వేదనకు తగ్గ ఫలితం ఆయనకు దక్కటం లేదన్న బావన కలగటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బాబుకు లభించిన కితాబు చూసినప్పుడు.. ఆయన పండగ చేసుకోవచ్చని చెప్పక తప్పదు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా ఏపీకి వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును చూసి విపరీతంగా ప్రశంసించేశారు. బాబు డ్యాష్ బోర్డు చూసి తామెంతో నేర్చుకున్నామని చెప్పిన ఆయన.. డ్యాష్ బోర్డు అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. తన శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదని ఫీలవుతున్న బాబుకు.. పనగారియా కితాబు కొత్త శక్తిని ఇస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/