Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

By:  Tupaki Desk   |   14 April 2022 12:30 PM GMT
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
X
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ముంబై సముద్ర తీరంలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ అనుమానాలతో ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 19 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ కేసులో మొత్తం 20 మంది అరెస్టు కాగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నారు. మిగతా వారు బెయిల్ పై బయటికొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఈ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. ప్రభాకర్ కు గుండెపోటు రాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఆయన లాయర్ తెలిపారు.

దాదాపు 25 రోజులకు పైగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్.. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.. ఈ కేసును ఎన్సీబీ డైరెక్టర్ గా అప్పుడున్న అధికారి పట్టుదలతో డీల్ చేయడంతో బెయిల్ రావడం కానాకష్టమైంది.

ఈ కేసు విచారించిన ఎన్ సీబీ సహా జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఆరోపణలు వచ్చాయి. వాంఖడే డబ్బులు వసూలు చేయమన్నాడని ఓ వ్యక్తి అప్రూవర్ గా మారడం సంచలనమైంది. ఆర్యన్ ఖాన్ ను విడుదల చేయాలంటే రూ.25 కోట్లు ఇవ్వాలని ఎన్సీబీ అధికారులు డిమాండ్ చేశారని సెయిల్ అనే వ్యక్తి అప్పట్లో ఆరోపించారు. దీంతో సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించి ఈ కేసు నుంచి ప్రభుత్వం తప్పించింది.

ఆర్యన్ కేసుతో అటు మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని మోడీ సర్కార్ కు మధ్య యుద్ధమే సాగింది. తాజాగా ఈ హైప్రొఫైల్ కేసులో ఇద్దరు ఎన్సీబీ అధికారులు సస్పెండ్ కావడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ప్రభాకర్ అకస్మాత్తుగా మరణించడంపై తనకు అనుమానాలున్నాయని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలిప్ వాల్సే పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ బలమైన, ఆరోగ్యకరమైన వ్యక్తి అని, అతనికి గుండెపోటు వచ్చే అవకాశం లేదని ఆరోపించారు. అయితే దీనిపై విచారిస్తామని హోం మంత్రి అనడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారిస్తున్న ఇద్దరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం సస్పెన్షన్ కు గురయ్యారు. అనుమానాస్పద వ్యవహారాలు నడిపిస్తున్నందుకు గాను వారిపై వేలు పడిందని చెబుతున్నారు. సస్పెండ్ అయిన ఇద్దరు ఆఫీసర్స్ ఏ కేసు కారణంగా శిక్షకు గురయ్యారో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులోనే వారిద్దరూ అనుమానాస్పద చర్యలకు పాల్పడ్డారా? అన్న కోణంలో చర్చ సాగుతోంది.