Begin typing your search above and press return to search.

కాలం పవర్ ఎలా ఉంటుందో చెప్పే ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్!

By:  Tupaki Desk   |   31 Oct 2021 4:34 AM GMT
కాలం పవర్ ఎలా ఉంటుందో చెప్పే ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్!
X
కాల మహిమ అని ఊరికే అనరేమో. గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇంతలో ఎంత మార్పు వచ్చిందని అనుకోకుండా ఉండలేం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నారన్న కారణంగా అదుపులోకి తీసుకోవటం.. అనంతరం రిమాండ్ కు తరలించటం తెలిసిందే. బెయిల్ కోసం పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. వారాల తరబడి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఎట్టకేలకు ఆర్యన్ బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆర్యన్ స్టార్ హోటల్ కు వెళ్లిపోయాడు.

ఇదిలా ఉంటే.. అతగాడి అరెస్టులో కీలకమైన వారి పరిస్థితి చూస్తే.. ఇంతలో ఎంత మార్పు అన్న మాట అనుకోకుండా ఉండలేం. ఆర్యన్ ను అరెస్టు చేసే నాటి పరిస్థితులకు.. తాజా పరిస్థితులకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండటం గమనార్హం. ఆర్యన్ ఖాన్ ను ఎన్ సీబీ కార్యాలయానికి తీసుకెళ్లిన కిరణ్ గోసావి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. డ్రగ్స్ కేసులో సాక్షిగా వ్యవహరిస్తున్న అతగాడు 2018లో చేసిన ఒక చీటింగ్ కేసులో అతడ్ని ఫూణె పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

మరోవైపు ఆర్యన్ ను అదుపులోకి తీసుకోవటంతో పాటు.. జైలుకు వెళ్లటానికి కారణమైన ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖడే విషయనికి వస్తే.. ఇతగాడికి ఎదురవుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అతడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాదు.. ఫోన్ ట్యాపింగ్ మొదలు.. ప్రముఖులను బెదిరిస్తున్నట్లుగా విమర్శలతో పాటు.. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు.. విడిచిపెట్టటానికి కోట్లాది రూపాయిల్ని అడిగారన్న మాటతో పాటు.. పలు అంశాలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారాయి.

దీంతో ఆయన పూర్తిస్థాయి ఆత్మరక్షణలో పడిపోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంతేకాదు.. సమీర్ కు నోటీసులు ఇచ్చేందుకు ముంబయి పోలీసులు సిద్ధమవుతున్నట్లుగాచెబుతున్నారు. ఇదంతా జరుగుతున్న వేళ.. వాంఖడేకు మూడు రోజుల నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయమంటూ హైకోర్టుకు ముంబయి పోలీసులు చెప్పారంటే.. తెర వెనుక ఏం జరుగుతుందన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగామారింది. కాల మహిమ అన్న మాటకు అసలుసిసలు ఉదాహరణగా తాజా ఎపిసోడ్ ను చెప్పొచ్చు. ఇంతకాలం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడిన ఆర్యన్ ఇప్పుడు స్టార్ హోటల్ లో ఉండగా.. అతడి అరెస్టులో కీలకభూమిక పోషించిన వారంతా ఇప్పుడు తమకు న్యాయపరమైన సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.