Begin typing your search above and press return to search.

చెప్పినట్లే తమిళ సై రాజ్ భవన్ కు పిలిచారు.. కేసీఆర్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   1 April 2022 5:33 AM GMT
చెప్పినట్లే తమిళ సై రాజ్ భవన్ కు పిలిచారు.. కేసీఆర్ ఏం చేస్తారు?
X
కాలం చాలా విచిత్రమైంది. ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా.. మరెంతో దగ్గరగా ఉండే వారు ముఖ ముఖాల్ని చూసుకోకుండా చేసే సత్తా సమయానికి మాత్రమే ఉంది. ఒకప్పుడు తనకెంతో ఇష్టంగా ఉండే ప్రదేశం.. తర్వాతి రోజుల్లో దాని దరిదాపుల్లోకి పోయేందుకు సైతం ఇష్టపడని పరిస్థితి కాలం మాత్రమే తీసుకురాగలదు. ప్రపంచంలో శక్తివంతమైనవి చాలానే ఉన్నట్లు కనిపిస్తాయి కానీ.. అందరిని తనలో ఇముడ్చుకునే అద్భుతం కాలం సొంతం. విశ్వం సైతం కాలానికి బానిస కావాల్సిందే. అలాంటిది మనమెంత.

గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఉన్న వేళలో.. సీఎం కేసీఆర్ తరచూ రాజ్ భవన్ కు వెళ్లే వారు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వెళ్లేసి గంటల కొద్దీ సమయాన్ని గడపటం ఎప్పుడూ చూసి ఉండలేదు. అలాంటిది కేసీఆర్ మాత్రం.. చాలా సేపే ఉండేవారు. ఆయన తరచూ వెళ్లే ప్రాంతంగా.. ఆయనకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉండే రాజ్ భవన్ ను ఇప్పుడు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడటం లేదు.

చిన్న అంశాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. గవర్నర్ తమిళ సై కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య దూరం ఎంత పెరిగిందన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ పక్కన పెట్టటంతో మొదలైన దూరం.. ఇప్పుడు మరింత దూరం పెరిగింది. చివరకు జనవరి 26న రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకులకు సైతం దూరంగా ఉండే పరిస్థితి.

ఈ దూరం మరింత పీక్స్ కు చేరుకున్నది మాత్రం గణతంత్ర దినోత్సవం వేళలో ప్రభుత్వ ప్రసంగ కాపీని పక్కకన పెట్టేసి సొంత ప్రసంగాన్ని చదివారంటూ ప్రభుత్వ వర్గాలు ఆరోపించటం.. ఇదిలా ఉండగా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్ కు ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవటం.. చివరకు బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టేసిన వైనంతో ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య దూరం ఎంతలా పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమైంది.

ఇలాంటివేళ.. తమ మధ్య పెరిగిన దూరాన్నితగ్గించేందుకు వీలుగా తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని గవర్నరే స్నేహహస్తం చాటారు. ఉగాది సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా ఆహ్వానాన్ని పంపుతానని పేర్కొన్నారు. ఈ రోజు (ఏప్రిల్ 1) గవర్నర్ తమిళ సై తీసుకునే నిర్ణయాలు కేసీఆర్ ఇబ్బందికరంగా మారాయనే దానికంటే.. తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగకపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని చెబుతారు. చేతిలో అంతులేని అధికారంలో ఉండి కూడా తాను అనుకున్న వ్యక్తికి ఒక పదవి ఇవ్వలేకపోవటం కేసీఆర్ అహాన్ని ఎంతలా దెబ్బ తీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దేశంలో మోడీ లాంటి శక్తివంతుడైన నేతను సైతం సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉందని నమ్మే కేసీఆర్ కు.. రాష్ట్ర గవర్నర్ చేత తాను అనుకున్నది చేయించుకోలేని తీరు ఆగ్రహాన్ని కలిగించిందని చెబుతారు. అందుకే.. అసాధారణంగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాన్ని లాగించే చర్యకు పూనుకోవటం ద్వారా.. తానేమిటన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారని చెప్పాలి.

ఇక్కడ తమిళ సైను సైతం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కూడా రాజకీయ నేతనే. ప్రత్యక్ష రాజకీయాలు.. అందునా తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీ తరఫున పని చేసిన ఆమె.. రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. జయలాంటి నేతతో తలపడ్డారు. అలాంటి ఆమెకు.. ఎప్పుడేం చేయాలి? ఎవరిని ఎలా డీల్ చేయాలన్న దానిపై ఆమెకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పక తప్పదు. కేసీఆర్ లాంటి నేతను రణంతో కంటే స్నేహంతోనే తాను అనుకున్నది చేయాలన్నట్లుగా ఆమె తీరు ఉందని చెప్పాలి.

తాజాగా రాజ్ భవన్ లో నిర్వహించే ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపుతానని ముందే ప్రకటించిన ఆమె.. అందుకు తగ్గట్లే ఆహ్వానాన్ని పంపటమే కాదు.. ఆ విషయాన్ని అందరికి తెలిసేలా చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు చాలా కాలంగా రావటం లేదని.. గ్యాప్ కు తన వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవని.. విభేదాలన్ని కనుమరుగు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పటం ద్వారా.. ప్రజల్లో మంచి మార్కులు పడేలా చేసుకున్నారు.

గవర్నర్ తో విభేదాలు ఉన్నా.. స్నేహ హస్తం చాచిన నేపథ్యంలో రాజ్ భవన్ కు వెళ్లాల్సిన బాధ్యత కేసీఆర్ మీద పడిందంటున్నారు. మనసులో ఇష్టం లేకున్నా.. ఇప్పుడు నలుగురి కోసమైనా వెళ్లాల్సిన పరిస్థితి. అలా కాకుండా వెళ్లకపోతే అవసరం లేని మొండితనం ఉన్న నేతగా నిలిచే పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న కేసీఆర్ లాంటి నేత.. స్నేహ హస్తం చాచిన గవర్నర్ విషయంలో ఎలా స్పందిస్తారనటం ద్వారా.. తానేమిటన్న సందేశాన్ని ఆయన ఇచ్చినట్లు అవుతుందంటున్నారు. ఏమైనా తెలుగువారి కొత్త సంవత్సరాది.. కేసీఆర్ కు కొత్త అనుభవాన్ని మిగులుస్తుందని చెప్పక తప్పదు.