Begin typing your search above and press return to search.

ధరలు పెరిగే వేళలో..ఎంపీల ఓటు విలువ తగ్గింది.. కారణమిదే

By:  Tupaki Desk   |   9 May 2022 5:31 AM GMT
ధరలు పెరిగే వేళలో..ఎంపీల ఓటు విలువ తగ్గింది.. కారణమిదే
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తువు విలువ పెరగటమే కానీ తగ్గటం మాత్రంఅస్సలు కనిపించదు. ఉప్పు నుంచి పప్పు వరకు.. గుండుసూది నుంచి విమానం వరకు ఏదైనా సరే.. అంతకంతకూ పెరగటమే తప్పించి.. తగ్గే పరిస్థితి కనిపించదు. అలాంటిది దేశాన్ని ప్రభావితం చేసేలా చట్టాలు చేసే ఎంపీల ఓటు విలువ మాత్రం తగ్గటం (తప్పుడు అర్థం తీసుకోవద్దు సుమి) ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అయినా ఎంపీ ఓటు విలువ ఎందుకు తగ్గుతుంది? దీని కారణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరగనుందన్నది చర్చగా మారింది.

ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుల ఓటు విలువ తగ్గనుంది. దీనికికారణం జమ్ముకశ్మీర్ ఈసారి ఎన్నికల్లో పాల్గొనకపోవటమే. ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంటే.. ఈసారి మాత్రం 700లకు తగ్గుతుందని చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎంపీల ఓటువిలువను రాష్ట్రాల అసెంబ్లీలు.. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ.. పుదుచ్చేరి.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా లెక్క కడతారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఆ స్థానే.. ఓటు విలువ తగ్గించాలని నిర్ణయించారు.

మరి.. ఇలా జరగటం ఇదే మొదటిసారా? అంటే కాదనే చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 1974లో గుజరాత్ అసెంబ్లీ రద్దు అయిన సంవత్సరంలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. ఆ సందర్భంగా ఓటు విలువను తగ్గించారు. అయితే కాలానికి అనుగుణంగా ఓటు విలువలో మార్పు వచ్ింది.

1952లో ఒక్కో ఎంపీ ఓటు విలువ 494 కాగా.. 1957లో అది కాస్తా 496కు పెరిగింది. ఆ తర్వాత 1962లో 493, 1967, 1979లో 576గా ఉంటే.. 1992 నాటికి ఓటు విలువ 702గా నిర్ణయించారు. ప్రస్తుతం 708గా మార్చారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పాల్గొని కారణంగా ఓటు విలువ 700లకు తగ్గనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవటానికి అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీయేకు సొంతంగా లేదు.

దీంతో కూటమికి కావాల్సిన దాని కంటే తక్కువగానే ఓట్లు ఉన్నాయి. దీంతో.. విపక్షానికి చెందిన పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి రావాల్సి ఉంటుంది. ఒకవేళ.. విపక్షాలన్నీ ఒకే మాట మీద నిలిస్తే మాత్రం.. అధికార ఎన్డీయేకు కొత్త తిప్పలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో.. ఈ లోపునే రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది.