Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాట ఎన్డీయే స‌ర్కారు...!

By:  Tupaki Desk   |   2 Aug 2017 1:42 PM GMT
త‌మిళ‌నాట ఎన్డీయే స‌ర్కారు...!
X
ద‌క్షిణాదిలో కీల‌క రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే ఎన్డీఏ గూటికి చేరనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వంలో బీజేపీ చేరనుంది. అలాగే కేంద్రంలో అన్నాడీఎంకేకు రెండు నుంచి మూడు మంత్రిపదవులు దక్కనున్నాయి. అయితే ఎన్డీయే- అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అన్నాడీఎంకేలోని పళని - పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్యలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుందని అంటున్నారు.

కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో ఇరు పార్టీల నేత‌లు కొన‌సాగ‌డం గురించి బీజేపీ-అన్నాడీఎంకేల మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా పళని స్వామి కొనసాగడానికి పన్నీర్ సెల్వం వర్గం అంగీకరించిందనీ, అలాగే పన్నీర్ సెల్వంను రాజ్యసభ సభ్యునిగా పంపేందుకు పళనిస్వామి వర్గం సుముఖత వ్యక్తం చేసిందని వార్త‌లు వ‌స్తున్నాయి. పళనిస్వామి కేబినెట్ లో బీజేపీకి స్థానం కల్పించడం, అలాగే కేంద్రంలో అన్నాడీఎంకేకు మూడు మంత్రి పదవులు ఇచ్చేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ ఆమోదం తెలిపారనీ చెబుతున్నారు.

మ‌రోవైపు ఈ ప‌రిణామాల‌ను చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గం సైతం నిశితంగా గ‌మ‌నిస్తోంది. బెంగళూరు జైలులో శశికళను ఆమె మేన‌ల్లుడు టీటీవీ దినకరన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వ్యవహారాన్ని దినకరన్‌ శశికళతో చర్చించారని స‌మాచారం. ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లను బ‌ట్టి త‌దుప‌రి అడుగులు వేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.