Begin typing your search above and press return to search.

జగన్ సక్సెస్ అయినట్లేనా ?

By:  Tupaki Desk   |   29 July 2021 6:55 AM GMT
జగన్ సక్సెస్ అయినట్లేనా ?
X
జరుగుతున్న ప్రచారం నిజమే అయితే వైసీపీ పోరాటం ఫలించినట్లే అనుకోవాలి. పోలవరం సవరించిన అంచనాల విషయంలో బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ ఎంపిలు భేటీ అయ్యారు. 2013లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రు. 20,313 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోంది. అయితే సవరించిన అంచనాల ప్రకారం కనీసం 47,725 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం కనబడలేదు.


కేంద్రం వైఖరితో విసిగిపోయిన ఎంపిలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నిరసనగళాన్ని వినిపిస్తున్నారు. పోలవరంకు నిధులు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అనేక అంశాలపై గడచిన పదిరోజులుగా పార్లమెంటులో నానా రచ్చ చేస్తున్నారు. వైసీపీ ఎంపిలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో ఈ స్ధాయిలో రచ్చ చేస్తారని ఊహించని కేంద్రం షాక్ తిన్నది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడి ఆదేశాలతో గజేంద్రసింగ్ షెకావత్ వైసీపీ ఎంపిలతో భేటీ అయ్యారు.

తాజా భేటీలో సవరించిన అంచనాలు రు. 47,725 కోట్లకు షెకావత్ ఓకే చేశారట. తన శాఖ నుండి గురువారం ఆర్ధికశాఖకు ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారట. ఆర్ధికశాఖ నుండి వచ్చే జరగనున్న క్యాబినెట్ సమావేశంలో సవరించిన అంచనాలకు ఆమోదం తీసుకుంటానని కూడా మంత్రి వైసీపీ ఎంపిలకు హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు.

షెకావత్ హామీ ఇచ్చినట్లుగా విజయసాయి చెప్పింది నిజమే అయితే జగన్ పెద్ద సక్సెస్ సాధించారనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టంటే కేవలం నిర్మాణాలని మాత్రమే కేంద్రం అనుకుంటున్నట్లుంది. భూసేకరణ, పునరావాసం ప్యాకేజీలు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమన్న విషయాన్ని కేంద్రం మరచిపోయినట్లుంది. అందుకనే వైసీపీ ఎంపిలు ఇంతగా రచ్చ చేస్తున్నది. చూద్దాం రాబోయే పది రోజుల్లో కేంద్రం ఏమిచేస్తుందో ?