Begin typing your search above and press return to search.

ఊరంతా ఒక దారి.. పాత‌బ‌స్తీది మ‌రో దారి!

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:52 AM GMT
ఊరంతా ఒక దారి.. పాత‌బ‌స్తీది మ‌రో దారి!
X
ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు న‌మ్మ‌కంగా గెలిచే స్థానాలు ఏవి? అన్న ప్ర‌శ్న ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌ల‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు మారిపోతుంటాయి. కానీ.. మ‌జ్లిస్ అధిప‌త్యం సాగే హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీద ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఒకేలా ఉంటుంది.

రాజ‌కీయ పార్టీ ఏదైనా కానీ.. మీడియా సంస్థ మ‌రేదైనా కానీ.. పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌జ్లిస్ జెండా ఎగురుతుంద‌న్న విష‌యాన్ని ఘంటా ప‌థంగా చెబుతుంటారు. ఇంత‌టి కంచుకోట లాంటి ఓల్డ్ సిటీ ఓట‌రు ఈసారి మ‌జ్లిస్ అధినేత‌కు షాకిచ్చారా? అన్న‌ది ఇప్పుడు షాకింగ్ గా మారింది. మ‌జ్లిస్ కు అడ్డా లాంటి పాత‌బ‌స్తీ ఈసారి ఓవైసీ బ్ర‌ద‌ర్స్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎందుకిలా? అంటే.. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోల్ అయిన పోలింగ్ శాతాల్ని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అన్నింటికి మించి పోలింగ్ త‌గ్గిన 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా పాత‌బ‌స్తీకి చెందిన నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌టం షాకింగ్ గా మారింది. సాధార‌ణంగా మ‌జ్లిస్ ప‌ట్టు ఉన్న ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ శాతాలు భారీగా న‌మోద‌వుతూ ఉంటాయి. దీనికి భిన్నంగా ఈసారి మాత్రం పోలింగ్ శాతం భారీగా క్షీణించ‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్య‌ల్ప పోలింగ్ న‌మోదైన నియోజ‌క‌వ‌ర్గంగా చార్మినార్ నిలిచింది. 2014లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ లో భారీగా పోలింగ్ జ‌రిగిన టాప్ 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో చార్మినార్ ఒక‌టిగా నిలిచింది. అలాంటిది ఈసారి అందుకు భిన్నంగా ఓట్లు న‌మోదైన ప‌రిస్థితి. ఆ మాట‌కు వ‌స్తే చార్మినార్ ఒక్క‌టే కాదు.. మిగిలిన ఆరింటిలోనూ పోలింగ్ శాతాలు త‌గ్గ‌టం మ‌జ్లిస్ కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని.. ఈసారి మ‌జ్లిస్ ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ శాతం త‌క్కువ కావ‌టంపై మ‌జ్లిస్ నేత‌లు పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌మ మీద ఉన్న అసంతృప్తితోనే పాత‌బ‌స్తీ వాసులు ఓటింగ్ కు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. అదే జ‌రిగితే.. సంచ‌ల‌న ఫ‌లితం ఏదైనా న‌మోదు అవుతుందా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. మ‌జ్లిస్‌కు అంత‌కు మించిన షాక్ మ‌రేదీ ఉండ‌దేమో.