Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ ..!

By:  Tupaki Desk   |   12 May 2020 2:30 PM GMT
లాక్ డౌన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ ..!
X
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారితో పోరాడటానికి ప్రపంచ దేశాలు లాక్‌ డౌన్ ‌నే ఆయుధంగా భావిస్తున్న సమయంలో .. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. లాక్‌ డౌన్‌ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ఆన్‌ లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కరోనాపై పోరాటం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లాక్ ‌డౌన్‌ విధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు. లాక్‌ డౌన్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఒవైసీ. దీనివల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని, కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఔరంగబాద్‌లో 16 మంది వలస కూలీలు మృత్యువాత పడిన సంఘటనను ఆయన గుర్తు చేశారు

ప్రజలంతా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరారు. క్వారంటైన్‌ మన మంచికే అని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా అనేది ఎవరికైనా రావచ్చని.. దానికి భయపడకుండా ఎవరికి వారే 8-10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండటం వల్ల తనతో పాటు.. తన కుటుంబ సభ్యులకు కూడా మేలు చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.