Begin typing your search above and press return to search.

ఉగ్రదాడిపై ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:12 AM GMT
ఉగ్రదాడిపై ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
X
ఎంఐఎం నేత‌ - ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం సుంజ్వాన్ సైనిక స్థావ‌రం స‌మీపంలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఈ దాడిలో ఏడుగురు భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘ‌ట‌న పై అస‌దుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఉగ్ర‌దాడిలో అమ‌రులైన సైనికుల్లో ఏడుగురు ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నార‌ని గుర్తు చేశారు. దేశం ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉన్నవారంద‌రికి ఈ ఉగ్ర‌దాడి క‌నివిప్పు క‌ల‌గాల‌ని అన్నారు. దేశం కోసం ప్రాణాల్పించే వారు పాకిస్తానీ ముస్లింలని అంట గ‌డుతున్నార‌ని అసదుద్దీన్ మండిప‌డ్డారు.

దేశం ప‌ట్ల ముస్లింలకున్న విధేయ‌త‌ను రుజువు చేయండని కొంద‌రు అంటున్నార‌ని, ఇంత‌కంటే మించిన విధేయ‌త ఉంటుందా అని ప్ర‌శ్నించారు. ఉగ్ర‌దాడిలో చనిపోయిన వారి గురించి ఎందుకు మాట్లాడుకోవ‌డంలేద‌ని, టీవీ ఛాన‌ళ్ల‌లో ముస్లింల విధేయ‌త‌ - కాశ్మీర్ పై చ‌ర్చిస్తారు. కానీ ఉగ్ర‌దాడిలో చ‌నిపోయిన ముస్లిం సైనికుల గురించి మాట్లాడుకోక పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని అన్నారు.

అంతేకాదు ముస్లింల సమగ్రతను ప్రశ్నిస్తూ, ముస్లిం పాకిస్థానీయులను పిలిచిన వారు ఈ ఘ‌ట‌న‌తోనైనా పాఠాన్ని నేర్చుకోవాలని సూచించారు. తాము ముస్లింలుగానే జీవిస్తున్నామ‌ని, అలాంటి వారిని హ‌త‌మార్చితే - వారిని మతం పేరుతో వివక్షత చూపిస్తున్నార‌ని అన్నారు. అయినా స‌రే మా స‌మ‌గ్ర‌త‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే ఓవైసీ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు జాతీయ నేత‌లు భిన్నాభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీ , జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. భారత రాజ్యాంగం సాక్షిగా పార్లమెంటుకు ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అన్నారు. ఓవైసీ విభ‌జించు పాలించు అనే సిద్దాంతాన్ని ఫాలో అవుతుంటార‌ని నిర్మ‌ల్ సింగ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మన అమరవీరులు దేశంకోసం ప్రాణాల్ని ఫ‌ణంగా పెట్టారు. అలాంటి వారిని హిందువులు - ముస్లింలు - సిక్కులు లేదా క్రైస్తవులుగా చూడలేమ‌న్నారు. వారు మ‌న దేశ వీర‌జవాన్ల‌ని కొనియాడారు.

ఇదిలా ఉంటే ఓవైసీ వ్యాఖ్య‌ల్ని సీపీఐ నాయ‌కుడు డి. రాజా స‌మ‌ర్ధించారు. ముస్లింల‌పై దేశ స‌మ‌గ్ర‌త గురించి మాట్లాడే వారికి ఈ ఘ‌ట‌న చెంప‌పెట్టులాంటిద‌ని అన్నారు.

కాగా సుంజ్వాన్ సైనిక స్థావ‌రం స‌మీపంలో జరిగిన ఉగ్ర‌దాడిలో ఆరుగురు సైనికులు, ఏడుగురు జ‌వాన్లు చ‌నిపోయారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రవాదుల్ని భార‌త సైనికులు హ‌త‌మార్చారు.