Begin typing your search above and press return to search.

అసద్ నోట ఐఎస్ ఖండన మాట

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:27 AM GMT
అసద్ నోట ఐఎస్ ఖండన మాట
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నోరు విప్పారు. పారిస్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇస్లామిక్ స్టేట్ ఇస్లాంకు మచ్చ లాంటిదని తేల్చారు. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1.5లక్షల మంది ముస్లింలను ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) బలి తీసుకున్నారని చెప్పారు. ఐఎస్ కు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ ఐఎస్ చేసే కార్యక్రమాల మీదా అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా స్పందించింది లేదన్న విమర్శ ఉంది. అలాంటి విమర్శల్లో పస లేదని చెబుతూ.. ఐఎస్ తీవ్రవాదులపై తాజాగా ఆయన మండిపడ్డారు. ఐఎస్ కార్యకలాపాల్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉత్తరప్రదేశ్ మంత్రి.. సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. పారిస్ ఘటనపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆజం ఖాన్ వ్యాఖ్యల్ని ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ.. ఇరాక్.. ఆఫ్ఘనిస్తాన్ లలో చోటు చేసుకున్న పరిస్థితుల్ని ఇస్లామిక్ స్టేట్ తనకు అనుకూలంగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

ఇక.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీని రక్షించటం ఏ కూటమికీ సాధ్యం కాదనటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం.. ఆ ఎన్నికలపై మజ్లిస్ కన్నేసింది. ముస్లింల అధిపత్యం ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. బీహార్ లో మాదిరే లౌకిక కూటమి పేరిట.. ఉత్తరప్రదేశ్ లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్న వేళ.. అసద్.. ఉత్తరప్రదేశ్ అధికారపక్షంపై విరుచుకుపడటం గమనార్హం.