Begin typing your search above and press return to search.

అసదుద్దీన్ లో ఈ యాంగిల్ చాలామందికి తెలీదు

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:40 AM GMT
అసదుద్దీన్ లో ఈ యాంగిల్ చాలామందికి తెలీదు
X
తన మాటలతో విరుచుకుపడే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ బ్రాండ్ గా సుపరిచితుడు. తన పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించటం ద్వారా.. హైదరాబాద్ మహానగరంలో తమ కంచుకోటగా మార్చుకున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫార్ములాను పలు రాష్ట్రాల్లో అమలు చేయాలన్న తపన ఎక్కువ. రాజకీయంగా అసద్ కు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే తెలిసినా.. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు మాత్రం బయటకు రావని చెబుతారు.

ఇక.. వ్యక్తిగత విషయాలు చాలా గోప్యంగా ఉంచేస్తారన్న మాట ఉంది. ఇలాంటివేళ.. అసదుద్దీన్ కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం పాతికేళ్లకు పైగా ఒకరికి తన ఇంట్లోని ఒక గదిని ఇచ్చిన వైనం ఆసక్తికరంగా అనిపించక మానదు. అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సంబంధించిన సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ముస్లింల తరఫున కక్షిదారు జఫర్యాబ్ జిలానీ కోర్టుకు హాజరవుతుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు చెందిన ఈ పెద్ద మనిషి సుప్రీంలో జరిగే ఈ కేసు వాదనలకు తప్పక హాజరవుతుంటారు. అయితే.. ఢిల్లీకి వచ్చే క్రమంలో ఆయనకు బసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ విషయాన్ని గుర్తించిన అసద్ తండ్రి సుల్తాన్ సలావుద్దీనో ఒవైసీ 1993లో ఢిల్లీలోని తమ నివాసంలోని ఒక గదిని జిలానీకి కేటాయించారు.

ఈ కేసు పూర్తి అయ్యే వరకూ జిలానీకి గదిని కేటాయించాలన్న ఆయన మాటకు తగ్గట్లే.. నేటికి అసద్ ఫాలో అవుతున్నట్లు చెబుతారు. గడిచిన 26 ఏళ్లుగా జిలానీ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ అసద్ నివాసంలోని గదిలో బస చేస్తుంటారు.

అంతేకాదు.. ఆయన వచ్చిన ప్రతిసారీ భోజన ఏర్పాట్లు కూడా చేస్తుండటం గమనార్హం. రాజకీయంగా మంచి గుర్తు ఉండి..తిరుగులేని రీతిలో పార్టీని తనకు పట్టున్న ప్రాంతంలో నడిపిస్తున్న అసద్ లాంటి వారు.. తన తండ్రి మాటను పాతికేళ్లకు పైనే తూచా తప్పకుండా పాటించటం అభినందించాల్సిన అంశంగా చెప్పకతప్పదు.