Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో బాబు పోటీ చేయ‌గ‌ల‌రా?:ఒవైసీ

By:  Tupaki Desk   |   9 Sep 2018 8:40 AM GMT
హైద‌రాబాద్ లో బాబు పోటీ చేయ‌గ‌ల‌రా?:ఒవైసీ
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి రాజుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పొత్తుల‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతోంద‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఆ పొత్తు వ‌ర్క‌వుట్ కాద‌ని - రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ దే గెలుప‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా కేసీఆర్ కు బాస‌ట‌గా టీఆర్ ఎస్ మిత్ర‌ప‌క్షం ఎంఐఎం అధ్య‌క్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ దే అధికారమ‌ని - సంపూర్ణ మెజారిటీతో కేసీఆర్ సీఎం అవుతార‌ని అస‌దుద్దీన్ తేల్చి చెప్పారు. టీఆర్ ఎస్ - మజ్లిస్ లను ఒంటరిగా ఎదుర్కొనే స‌త్తా లేకే ఈ కొత్త పొత్తులు తెర‌పైకి వ‌స్తున్నాయ‌న్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ఏమీ చేయని చంద్రబాబు తెలంగాణకు ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ కొత్త పొత్తుతో కాంగ్రెస్‌ - టీడీపీలు నిండా మునుగుతాయని - అయినా కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా స్థాపించిన‌ టీడీపీ.....అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్ర‌శ్నించారు. శనివారం ప్రగతి భవన్‌లో కేటీఆర్ ను కలిసిన అసదుద్దీన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ పార్టీకి పదవుల పై ఆశ లేదని....మైనార్టీలు - బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తాము పాటుపడతామని అస‌దుద్దీన్ చెప్పారు. నాలుగేళ్లుగా తెలంగాణ‌లో ఎటువంటి మతఘర్షణ‌లు జరగలేదని, కేసీఆర్ పాల‌న‌లో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల్లో టీఆర్ ఎస్ పై న‌మ్మ‌కం ఉండ‌బ‌ట్టే కేసీఆర్ ముందస్తుకు వెళ్లార‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ సిద్ధ‌మవుతోంద‌ని - తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఆ పొత్తును ప్ర‌జ‌లు అంగీక‌రించ‌ర‌ని, దమ్ముంటే హైదరాబాద్‌ ఎన్నికల్లో చంద్ర‌బాబు...లేకుంటే లోకేష్‌ పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ కు అజెండా లేదని, ఎన్నిక‌ల వ‌స్తోంటే భ‌య‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కేసీఆర్, తెరాసకు విజన్ ఉందని, కేసీఆర్ తప్పు చేస్తే విమర్శిస్తామని అన్నారు.