Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మోదీ - మమతా స్వభావం ఒక్కటే : ఒవైసీ

By:  Tupaki Desk   |   9 April 2021 7:30 AM GMT
ఆ విషయంలో మోదీ - మమతా స్వభావం ఒక్కటే : ఒవైసీ
X
దేశ ప్రధాని నరేంద్ర మోడీ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు మనుషులు వేరైనా స్వభావాలు ఒకటే, ఈ ఇద్దరూ కూడా నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటి వారని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు. జాతీయ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒవైసీ ఎన్నికల సందర్బంగా మమతా మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. హిందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మమతా తన ఐడెంటిటీ బయటపెట్టిందని, హిందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆమె అసలు రూపం బయటపెట్టారని అసద్దుద్దిన్ ఫైర్ అయ్యారు.

చండీపథ్ పారాయణం, తన గోత్రం చెప్పడం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోడానికి కాదా అని ప్రశ్నించారు ఒవైసీ. అలాగే , ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ వెళ్లి ఆ దేశ విముక్తి పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లానని చెప్పి.. తిరిగి ఇక్కడికి వచ్చి దేశంలో కోటిమందికి పైగా బంగ్లాదేశ్ ముస్లిం అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానం ఏంటో ఈ మాటతోనే అర్థమవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే .. ఇక పశ్చిమ బెంగాల్ లో ఏఐఎంఐఎం పోటీలో ఉండటంపై స్పందించారు. బెంగాల్ లో తమ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించి చాలా ఏళ్లు అవుతుంది అని, ఇక్కడ తమ అవసరం ఉందని, మమతా పాలనలో ముస్లింల పరిస్థితి దారుణంగా తయారైందని.. 16 శాతం మంది ముస్లిం పిల్లలు పాఠశాల ముఖం కూడా చూడటం లేదని, ముస్లిం యువతలో నాయకత్వ లక్షణాలు కావాలని అందుకే తాము బెంగాల్ లో పోటీచేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో 53 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు తమ వారి కోసం ఏమి చెయ్యలేదని అన్నారు. బెంగాల్ ప్రజలకు తమ అవసరం ఉంది కాబట్టే పోటీలో ఉన్నామని అన్నారు. టీఎంసీ ముస్లిమ్స్ కు సీట్లు కేటాయించినా వారు గెలిచి ముస్లిం సమాజానికి ఏమి చేయలేకపోతున్నారని అన్నారు. వారు మూగవారిగా మమతతో మాట్లాడలేకుండా ఉన్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లు సాదిస్తుందని ఒవైసీ తెలిపారు.