Begin typing your search above and press return to search.

మోడీ తర్వాత.. నువ్వేం చేశావో చెప్పు అసద్

By:  Tupaki Desk   |   2 Jan 2017 8:17 AM GMT
మోడీ తర్వాత.. నువ్వేం చేశావో చెప్పు అసద్
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చాలా చిత్రంగా మాట్లాడతారు. పాతబస్తీలో అర్థరాత్రి వేళకు కాస్త అటూఇటూగా పెద్ద పెద్ద బహిరంగ సభల్ని నిర్వహించే ఆయన.. ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగిస్తుంటారు. ఉర్దూలో ఆయన చేసే ప్రసంగాల్ని ఎవరైనా తెలుగులోకి తర్జుమా చేసి.. వాటిని అక్షరం మిస్ కాకుండా అచ్చేసి.. వాటిని భారీ ఎత్తున ప్రచారం చేస్తే.. అసద్ అసలు రంగు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.

మతాన్ని ఆయుధంగా చేసుకొని.. భావోద్వేగ రాజకీయాలు నిర్వహించే అసద్ లాంటోళ్లు.. కొన్ని విషయాల మీద వారు చెప్పే నీతులు.. తమ రాజకీయ ప్రత్యర్థులపై వారు సంధించే ప్రశ్నలు చూసినప్పుడు నవ్వు వస్తాయి. నోరు తెరిస్తే.. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసమే తాము బతుకుతున్నట్లుగా చెప్పే వారు.. గడిచిన దశాబ్దాలుగా.. అధికారపక్షంతో చెట్టాపట్టాలు వేసుకొని బతికేసే.. అసద్ అండ్ కో.. పాతబస్తీలోని ప్రజల జీవన ప్రమాణాల్ని ఎందుకు పెంచలేకపోయారన్న సూటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు.

విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారని చెప్పే అసద్ లాంటోళ్లు.. పాతబస్తీలోని సగటు ముస్లిం జీవన ప్రమాణాల్ని ఎందుకు పెంచలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. పాతబస్తీ ప్రజలంతా ఆయన పార్టీ వెంటే నడుస్తున్న వేళ.. పార్టీ అధినేతగా..తనను నమ్ముకున్న ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పు తెచ్చారన్న లెక్క తీస్తే.. ఆయనలోని కమిట్ మెంట్ లెవెల్స్ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.

పాతబస్తీ రాజకీయాల్ని దేశ వ్యాప్తంగా ఉన్న మైనార్టీ కాలనీల్లో చేపట్టాలని భావిస్తున్న అసద్ కు.. మహారాష్ట్రలో కొంతమేర తప్పించి.. మరెక్కడా ఆయనకు సానుకూలత లభించిందని చెప్పలేం. తాజాగా ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పార్టీ ప్రచారాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మరాఠా రాజు శివాజీ స్మారక స్థూపానికి భూమిపూజ చేసిన సందర్భంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి ప్రధాని మోడీ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.

శివాజీ మెమోరియల్ కోసం రూ.3600 కోట్లు ఖర్చు పెట్టటాన్ని తాము వ్యతిరేకించటం లేదని.. శివాజీ గొప్పతనం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ.. ముస్లింల కృషి గురించి ఎందుకు ప్రస్తావించటం లేదని ప్రశ్నించారు. మోడీ సంగతి తర్వాత.. ఎప్పుడైనా అసద్.. ముస్లిమేతర వ్యక్తిని గొప్పగా కీర్తించటం చూశారా? ముందు తన నోటి నుంచిఅలాంటి మాటలు చెప్పిన తర్వాత.. మిగిలిన వారి నోటి నుంచి అలాంటివి రావాలని కోరుకోవటం బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/