Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..అసద్ కు అస్సలు నచ్చలేదు!

By:  Tupaki Desk   |   21 Aug 2019 5:31 AM GMT
ట్రంప్ కు మోడీ ఫోన్ కాల్..అసద్ కు అస్సలు నచ్చలేదు!
X
ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కోసం దాన్ని నానబెట్టి.. నానబెట్టి ఉంచటం మంచిదా? లేదంటే.. అలాంటి ఇష్యూలను తనకున్న పవర్ తో పవర్ ఫుల్ గా డీల్ చేసే వాడితో సెట్ చేయించటం మంచిదా? అన్న ప్రశ్నను సంధిస్తే మీరేం సమాధానం ఇస్తారు? సమస్య మీదై.. మీ కుటుంబానిదైనప్పుడు సొల్యూషన్ కోసం ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా వన్ మ్యాన్ ఆర్మీ మాదిరి నా సమస్యను నేనే చూసుకుంటానని అనుకోవటాన్ని ఏమంటారు?

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరు ఇప్పుడు అలానే ఉంది. పాక్ ను దారికి తెచ్చేందుకు సరిహద్దుల్లో యుద్ధం చేయటమో.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చర్యలు తీసుకోవటం మంచిదా? పాక్ తిక్క అణిచే పెద్దన్న అమెరికాను మాట సాయం అడగటం మంచిదా? అన్న ప్రశ్నకు ఎక్కువమంది ట్రంప్ తో సెట్ చేయించటానికే ఇష్టపడతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. కశ్మీర్ మీద మోడీ మాష్టారు ట్రంప్ ను మధ్యవర్తిత్వం వహించమని అడగటం లేదు. కేవలం.. నోరు పారేసుకోకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సుమా అన్న విషయాన్ని ట్రంప్ చేత చెప్పించారంతే.

భారత్- పాక్ మధ్య పంచాయితీ అంటే తీర్చేందుకు అమెరికా.. చైనా.. రష్యాలాంటివి ఆసక్తిని చూపిస్తాయి కానీ.. అలాంటి మధ్యవర్తిత్వాల్ని అస్సలు ఒప్పుకోలేం. కానీ.. సమయానికి తగ్గట్లు మాట సాయం కోరటం తప్పేం కాదు. చెలరేగిపోతున్న దాయాదిని ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే నష్టం ఎంతన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే బాధ్యతను ఎవరో ఒకరు తీసుకోవాలి. అది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటోడైతే మరింత బాగుంటుంది.

కానీ.. ఈ వ్యూహం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అస్సలు నచ్చలేదు. ట్రంప్ కు మోడీ ఫోన్ చేసిన విషయం మీద తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశం ఇరుదేశాల సమస్యగా భావిస్తున్న వేళ.. ట్రంప్ తో భారత్ చర్చించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

పంచాయితీలు పరిష్కరించటానికి ట్రంప్ ఏమైనా పోలీసా? సమాజంలో సమస్యలు పరిష్కరించే చౌదరీనా? అంటూ విరుచుకుపడ్డారు. దాయాదితో కశ్మీర్ ఇష్యూ ద్వైపాక్షిక అంశమని.. ఇతర దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేసిన భారత్ తీరుకు భిన్నంగా మోడీ వ్యవహారశైలి ఉందన్నారు.

ట్రంప్ తో మోడీ ఫోన్ సంభాషణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసద్ మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. దాయాదిని సెట్ చేయటానికి ట్రంప్ లాంటోడి అవసరం అంతో ఇంతో భారత్ కు ఉందని. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్న వేళ.. పాక్ కు నేరుగా వార్నింగ్ ఇచ్చే ధైర్యం ఒక్క అమెరికా మాత్రమే చేయగలదు. అంతేకాదు.. పాక్ తీరును అమెరికా ఆక్షేపిస్తే.. ప్రపంచంలో పాక్ ఒంటరి అవుతుందన్న చిన్న పాయింట్ అసద్ లాంటి మేధావి బుర్రకు ఎందుకు తట్టనట్లు?