Begin typing your search above and press return to search.

ఇదేం లాజిక్ అస‌ద్‌...అస్స‌లు సూట్ కాలేదు

By:  Tupaki Desk   |   19 Jan 2020 2:30 PM GMT
ఇదేం లాజిక్ అస‌ద్‌...అస్స‌లు సూట్ కాలేదు
X
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన ఫైర్‌ బ్రాండ్ నేత అస‌దుద్దీన్ ఓవైసీ గ‌త కొద్దిరోజులుగా కేంద్రంలోని బీజేపీపై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై హైద‌రాబాద్ ఎంపీ త‌న ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఓవైసీ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మజ్లిస్‌ పార్టీ ఒక్క హైదరాబాద్‌ కే పరిమితమయ్యిందని ప్రచారం చేస్తుండటాన్ని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తప్పు పట్టారు. 70 ఏళ్ల‌లో మజ్లిస్‌ పార్టీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిందని - భవిష్యత్తులోనూ చేయబోతున్నదని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో పోటీచేస్తున్న ఆరుగురు ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార సభకు హాజరైన అస‌దుద్దీన్ ఓవైసీ ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. మజ్లిస్ ప్ర‌జ‌ల కోసం పోరాడితే హిందూ - ముస్లింల మధ్య మతకల్లోలాలను బీజేపీ సృష్టిస్తుందని ఓవైసీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధినేత సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఏ ఒక్కచోట బీజేపీకి మున్సిపల్‌ పీఠం దక్కబోదని జోస్యం చెప్పారు. ఎంఐఎం నుంచి ఎన్నికల్లో పోటీలో ఉంటే కాంగ్రెస్‌ - బీజేపీలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

కాగా, ఓ రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌లు దేశ‌మంత‌టికి వ‌ర్తించే సీఏఏకు లింక్ పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పుర‌పాల‌క ఎన్నిక‌లు పూర్తిగా స్థానిక ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేవి. ఇంకా చెప్పాలంటే...బ‌రిలో దిగిన అభ్య‌ర్థుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జ‌రిగేవి. ఇలాంటి త‌రుణంలో...ఎక్క‌డో ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్ద‌లు...తెలంగాణ‌లో ఇంకా తాము పూర్తిగా ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌లేద‌ని గమ‌నించిన నాయ‌కులు...ఈ ఎన్నిక‌లు ఎలా రెఫ‌రెండంగా భావిస్తార‌ని..ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.