Begin typing your search above and press return to search.

కేసీఆర్ నివాసానికి అసద్.. అసలు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   25 Dec 2019 10:51 AM GMT
కేసీఆర్ నివాసానికి అసద్.. అసలు కారణం ఇదేనా?
X
దగ్గర దగ్గర ఐదారు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసినట్లుగా చెబుతారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆగమాగం కావటమే కాదు.. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరిగితే.. యూపీ లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి మరణాలు చోటు చేసుకున్నాయి.

ఇలాంటి వేళ హైదరాబాద్ లోనూ నిరసనల కు.. పెద్ద ఎత్తున ఆందోళనల కు ప్లానింగ్ జరుగుతున్న వైనాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారని చెబుతారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి.. నిరసనల విషయంలో సంయమనం పాటించాలని.. కేంద్రం మీద ఉన్న కోపాన్ని క్రమపద్దతిలో వినియోగించాలే తప్పించి.. తలనొప్పులు పెరిగేలా చేయొద్దని కోరారు.

తనకెంతో మిత్రుడైన కేసీఆర్ అడిగిన తర్వాత అసద్ కాదంటారా? అందుకే కాబోలు శనివారం రాత్రివేళ తమ అడ్డా అయిన దారుస్సలాంలో నిర్వహించిన బహిరంగ సభలో అసద్ ప్రసంగాన్ని విన్నవారంతా అవాక్కు అయ్యారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా దేశ భక్తి గురించి.. ముస్లింలకున్న జాతీయ భావనలు అందరికి తెలియజేసేలా ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అసద్ వ్యాఖ్యలు వైరల్ గా మారటమే కాదు.. సంచలనంగా మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ భేటీ అయ్యేందుకు అసద్ డిసైడ్ అయ్యారు. ఎందుకిలా? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయటం.. జాతీయ పౌర జాబితాతో పాటు జాతీయ జనభా రిజిస్టర్ కు వ్యతిరేకం గా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అసద్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఫోన్ చేసినంతనే తన బాడీ లాంగ్వేజ్ కు.. తన గత ప్రసంగాలకు భిన్నంగా మాట్లాడిన అసద్ వ్యాఖ్యల రుణాన్ని సీఎం కేసీఆర్ తీర్చుకోవటం ఖాయమన్న భావన వ్యక్తమువుతోంది. ఈ అంచనా ఎంతమేర నిజమన్నది కాలమే తేల్చాలి.