Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ తో లాబీయింగ్ ద్వారా ఓవైసీ కొత్త స్కెచ్‌

By:  Tupaki Desk   |   20 April 2018 5:11 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ తో లాబీయింగ్ ద్వారా ఓవైసీ కొత్త స్కెచ్‌
X
ఏఐఎంఐఎం అధ్యక్షుడు - హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మ‌రో అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌క్కా మ‌సీదు తీర్పు విష‌యంలో ఇన్నాళ్లు అంత‌ర్గ‌తంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఓవైసీ తాజాగా దీన్ని మ‌రో రూపంలో చ‌ర్చ‌ల్లో ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకోసం గ‌వ‌ర్న‌ర్ ద్వారా లాబీయింగ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌క్కామసీదు పేలుళ్ల కేసులో సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ ఐఏ) పైకోర్టులో అప్పీలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని పలు ముస్లిం సంస్థల ప్రతినిధుల బృందం గురువారం రాజ్‌ భవన్‌ లో గవర్నర్ నరసింహన్‌ ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ పేలుడు ఘటనలో మృతులు - బాధిత కుటుంబాలకు న్యాయం జరుగలేదని గవర్నర్‌ కు విన్నవించారు. ఈ కేసు విచారణ కాంప్రమైజ్ ప్రాసిక్యూషన్ తరహాలో జరిగిందన్నారు. బాధితులకు న్యాయం జరుగాలంటే పైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని - ఈ మేరకు కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు.

గ‌వ‌ర్న‌ర్‌ తో భేటీ అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ మక్కామసీదు పేలుడు ఘటన తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు ముస్లింలు చనిపోయినట్టు తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై విచారణ జరిపిన భాస్కర్‌ రావు కమిషన్ తన నివేదికను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదన్నారు. ఆ నివేదికను వారి అధికారాలను ఉపయోగించి ప్రజల్లోకి - అసెంబ్లీలోకి తీసుకురావాలని గవర్నర్‌ ను కోరినట్టు తెలిపారు.మక్కామసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టకపోవటంతోనే నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఒత్తిడితోనే కేసును బలహీనపరిచారనే విషయం ప్రజలందరికీ స్పష్టమైందన్నారు. మక్కామసీదు పేలుళ్ల నిందితులు నిర్దోషులైతే మరి బాంబులు ఎవరు పేల్చారని, అంతమంది అమాయక ప్రజలు ఎలా చనిపోయారని ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పుపై ఎంఐఎం పార్టీ న్యాయపోరాటం చేస్తుందని, కొన్నిరోజుల్లోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు ఎంఐఎం వారికి అండగా ఉంటుందని చెప్పారు. ఈ కేసు విచారణను రీట్రయల్ చేయాలని, లేదా పై కోర్టులో అప్పీలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లో ఎవరైనా అప్పీలుకు వెళ్తామమంటే అప్పీలు చేయడానికి, న్యాయ సహాయం అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

కశ్మీర్‌ లోని కతువా అడవిలో చిన్నారి హత్యతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటం దారుణమని ఓవైసీ అన్నారు. పాశవిక చర్యలపై కాంగ్రెస్ పార్టీ సైతం నోరుమెదకపోవటం శోచనీయమన్నారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడటంలో ప్రధాని తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు - జీఎస్టీ పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం వేసిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ చూసినా ఏటీఎంల వద్ద డబ్బుల కోసం బారులుతీరిన జనాలు కనబడుతున్నారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఈ నెల 20న ఎంఐఎం పార్టీ బంద్‌ కు పిలుపు ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని - తాము బంద్‌ కు పిలుపు ఇవ్వలేదని స్పష్టంచేశారు.