Begin typing your search above and press return to search.

ఎంఐఎంకు షాక్‌

By:  Tupaki Desk   |   9 Nov 2015 6:10 AM GMT
ఎంఐఎంకు షాక్‌
X
వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న మ‌జ్లీస్ పార్టీని బీహారీలు చెక్ పెట్టారు. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాల‌కు... మ‌త‌తత్వ రాజ‌కీయాల‌కు తాము వీలైనంత దూరం అని చెప్ప‌క‌నే చెప్పారు. అంత‌ర్గ‌తంగా మతతత్వ ఎజెండాతో ముందుకు వెళ్లిన బీజేపీ కూటమికి ఎంత ఘోర పరాజయం ఎదురైందో, అదే తరహాలో మరో మతతత్వపార్టీ ఎంఐఎంకూ ప్రజలు బుద్ధి చెప్పారు. బీహార్‌ బరిలోకి తొలిసారిగా ఆరుస్థానాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టగా అన్నింటా ఓటమి పాలైంది. తూర్పు బీహార్‌ లో - బెంగాల్‌ సరిహద్దు జిల్లాల్లో పోటీ చేసిన నియోజకవర్గాల్లో అయితే డిపాజిట్లు కూడా గల్లంతయింది. కోచదామన్‌ స్థానంలో ఎంఐఎం అభ్యర్థికి 15వేల ఓట్లు లభించగా, బైసి స్థానంలో 14 వేలు ఓట్లు లభించాయి. మిగతా అన్ని స్థానాల్లో ఐదంకెల సంఖ్యను కూడా చేరుకోలేకపోయింది. బిసాయిలో మాత్రం లెక్కింపు ప్రారంభమైన తొలి గంటవరకు అధిక్యంలో నిలిచింది.

ఈ ఫ‌లితాల‌పై పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఓటమి ఎదురైందన్నారు. ఈ ఎన్నికల్లో బీహార్‌ ప్రజలకు మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నామని చెప్పారు. తర్వాతి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

హైద‌రాబాద్‌ కే గ‌తంలో ప‌రిమిత‌మైన మ‌జ్లిస్ పార్టీ త‌న ఉనికిని విస్త‌రించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ప‌లుచోట్ల విజ‌యం సాధించింది. యూపీ జిల్లా పంచాయతీ - బ్లాక్ పంచాయతీ సభ్యుల ఎన్నిక కోసం నాలుగు దశల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించ‌గా ఎంఐఎం పార్టీ ఆ ఎన్నిక‌ల్లో ఖాతా తెరిచి 8 పంచాయ‌తీల‌ను గెలుచుకుంది. మ‌రోవైపు మ‌హారాష్ర్ట‌లోని క‌ల్యాణ్ డోంబ్రివ‌లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రెండు వార్డులు గెలుచుకుంది. లాతూర్ జిల్లా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ రెండు స్థానాల‌ను త‌న ఖాతాలో జ‌మ‌చేసుకుంది. మ‌హారాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌తంలో రెండు స్థానాలు గెలుచుకుంది. ఇలా గ‌త ఏడాది నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకున్న ఎంఐఎం అధినేత‌లు బీహార్‌ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా... చేదు ఫ‌లితం త‌ప్ప‌లేదు.