Begin typing your search above and press return to search.

మజ్లిస్ ను పాతబస్తీలో కొట్టేందుకు ప్లాన్!

By:  Tupaki Desk   |   22 Oct 2018 11:23 AM GMT
మజ్లిస్ ను పాతబస్తీలో కొట్టేందుకు ప్లాన్!
X
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మజ్లిస్ పార్టీ.. కాంగ్రెస్ కు మంచి మిత్రపక్షం.. కానీ తర్వాత కాంగ్రెసోళ్లు మారారు.. అటు మజ్లిస్ కూడా మారింది. దేశ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ కు - ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తూ మజ్లిస్ ముందుకుసాగుతోంది. తెలంగాణ అధికార పక్షం టీఆర్ ఎస్ తో స్నేహపూర్వక పోటీలను పెట్టుకొని ఎన్నికల్లో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లో మజ్లిస్.. మిగతా తెలంగాణ అంతటా టీఆర్ ఎస్ కు ఓట్లు పడేలా మజ్లిస్-టీఆర్ ఎస్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు అర్థమవుతోంది.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీ లో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడిపై ట్వీట్ చేస్తూ దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు అనాధిగా సపోర్ట్ గా ఉన్న ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ కు దక్కకుండా మజ్లిస్ వ్యవహరిస్తోంది. బీహార్ - యూపీ - మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్ బరిలోకి దిగి మైనార్టీ ఓట్లు చీలి పట్టున్న స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. ఇది అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చుతోంది.. దీంతో మజ్లిస్ పని పట్టాలని కాంగ్రెస్ రెడీ అయ్యింది.

మజ్లిస్ కేంద్రస్థానం అయిన పాతబస్తీలోనే దాన్ని మట్టికరిపించాలని కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసింది. ఎంఐఎం పోటీచేసే బలమైన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ స్థాయి ముస్లిం మైనారిటీ నాయకులను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఈమేరకు రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావణ యాత్రలో మజ్లిస్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.

పాతబస్తీలోని ప్రతీ స్థానాన్ని టార్గెట్ చేసి మైనారిటీ కుటుంబాలతో కాంగ్రెస్ నేతలు భేటి కావాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేత నదీమ్ జావిద్ ఆదివారం పాతబస్తీ మైనార్టీ నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రస్తుతం మజ్లిస్ కు ఏడు సిట్టింగ్ స్థానాలు ఉండగా.. అందులో నాలుగు స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో బలమైన కాంగ్రెస్ అగ్రనేతలను దింపేందుకు వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.